ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిందన్న‌-సిఎం చంద్రబాబునాయుడు

దిల్లీ : నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగో సమావేశం దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడారు. అక్షరక్రమం ప్రకారం చంద్రబాబుకు ముందుగా మాట్లాడే అవకాశం లభించింది.రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ కేంద్రం వైఖరిని చంద్రబాబు ఎండగట్టారు. ఆదాయంలో ఏపీ సేవారంగం వృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిందని పేర్కొన్నారు. విభజన చట్టంలోని అంశాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కావాల్సిన నిధులు సమకూర్చాలని అడిగారు. పోలవరం భూసేకరణ, పునరావస కల్పనకు కావాల్సిన నిధులను కోరారు. రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చాలని.. రెవెన్యూలోటు విషయంలో గతంలో ఇచ్చిన హామీని విస్మరించారని పేర్కొన్నారు.నాలుగేళ్లలో ఏపీ సొంతంగానే ఎదుగుతూ వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు జీఎస్టీ విఘాతం కలిగిస్తోందని మండిపడ్డారు. స్థానికంగా పన్నులు విధించే వెసులుబాటు లేకుండా పోయిందన్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు కొరత సమస్యను కేంద్రం ఇంకా పరిష్కరించలేదని విమర్శించారు. రాష్ట్రానికి రైల్వే జోన్‌ ఇస్తామని ప్రకటించి.. ఇప్పటివరకరూ ఆ హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. మిగతా రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకూ ఏపీకి చేయూత నివ్వాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి పదేళ్లపాటు హోదా కావాలని ఆరోజు అడిగింది భాజపా నేతలేనని గుర్తుచేశారు.

చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్న రాజ్‌నాథ్‌..

నీతి ఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. అయితే 7 నిమిషాల ప్రసంగం అనంతరం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇచ్చిన సమయం ముగిసిపోయిందంటూ రాజ్‌నాథ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఏపీ సమస్యలు ప్రత్యేకమైనవి అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.

ఏపీ డిమాండ్‌ను సమర్థించిన నితీశ్‌..

ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న డిమాండ్‌ను బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ సమర్థించారు. అయితే బిహార్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో 2011 జనాభా లెక్కలను పరిగణించవద్దన్న చంద్రబాబు వాదనతో పశ్చిమ్‌బంగ సీఎం మమతాబెనర్జీ ఏకీభవించారు.