ఏజెన్సీని వణికిస్తున్న చలిపులి
దట్టంగా పొగమంచుతో వాహనదారులకు ఇక్కట్లు
చలితీవ్రతతో ప్రజల ఆందోళన
ఆదిలాబాద్,జనవరి31(జనంసాక్షి): చిలికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వణుకుతోంది. శీతల గాలులతో ఎముకలు కొరికేస్తుంది. దీనికి తోడు దట్టంగా పరుచుకుంటున్న పొగమంచు వాహనదారులను కదలనీయడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవులు, గుట్టలు ఉన్న చోట్ల చలి ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. ఉదయం సూర్యోదయం అయినా చలి మాత్రం వదలడం లేదు. పగటి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. సాయంత్ర నాలుగు గంటలకే చలి మొదలై రాత్రి 9 గంటల అనంతరం తీవ్రరూపం దాల్చుతోంది. జిల్లా వ్యాప్తంగా చలితీవ్రత కొనసాగుతోంది. చలి ప్రభా వం రోజు రోజుకూ అధికమవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం జిల్లాలో 6.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో జిల్లా వాతావరణం కశ్మీర్ తలపిస్తుంది.తెల్లవారుజామున పొగమంచు కురుస్తున్నది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. కొనసాగుతున్న అల్పపీడన ద్రోణుల కారణంగా మరో రెండు రోజులు ఇలాగా వాతావరణం ఉండే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ద్రోణుల ప్రభావంతో చలిగాలులు వీస్తుండగా చలి మరింత తీవ్రమైంది. చలి తీవ్రత నుంచి రక్షణ పొందడానికి ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా గజగజ వణుకుతున్నారు. రాత్రీ పగలూ తేడా లేకుండా వీస్తున్న చలిగాలులకి వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, అస్థమా వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో ఉపశమనం కోసం చలిమంటలు వేసుకొంటున్నారు. చలి పంజాకు ఉదయం, రాత్రి వేళల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చలితో పాటు చల్లనిగాలులు వీస్తుండడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చరలో 3.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, భీంపూర్ మండలం ఆర్లి(టి)లో 3.6 డిగ్రీలు, నేరడిగొండలో 3.9 డిగ్రీలు, ఆదిలాబాద్ 4.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వీటితో పాటు జైనథ్ మండలంలో 7 డిగ్రీలు తలమడుగులో 7.3, బేలలో 7.3, నార్నూర్ 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లలేక పోతున్నారు. చలితో ఉదయం పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులతో పాటు కూలీ పనులు చేసుకునే అవస్థ పడుతున్నారు. చలిప్రభావంతో పలు రహదారులతో పాటు వీధులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి.