ఏదీ సాగ‌ర్ శుద్ది

కాలుష్య భూతం నుంచి బయటపడని హుస్సేన్‌ సాగర్‌

ఏటా నిమజ్జనాలతో మురికి కూపంగా తయారైన తటాకం
పాలకుల చిత్తశుధ్ది లోపంతో పెరుగుతున్న కాలుష్యం
హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కాలుష్యం కలవర పెడుతోంది. క్యాన్సర్‌ను భూతంలా వదులుతోంది. అయినా పాలకుల్లో మార్పు రావడం లేదు. ప్రజల్లో చైతన్యం రావడం లేదు. ప్లాస్టిక్‌ నిషేధంపై ప్కటనలే తప్ప ఆచరణ కానరావడం లేదు. ప్రజలను బాధ్యతా రహితంగా చేసి పాలకులు తమ పబ్బం గడుపుకుంటున్నారు. అవసరమైన వాటికి చట్టాలు చేస్తూ కఠినంగా అమలు చేస్తున్న ప్రభుత్వం కాలుష్యనిరోధం విషయంలో బాధ్యతలను విస్మరించింది. హైదరాబాద్‌ హుస్‌ఏన్‌ సాగర్‌నే తసీఉకుంటే అది తళుక్కున మెరిసే తటాకంగా మారుతుందన్న భరోసా కల్పించిన సిఎం కెసిఆర్‌ నాలుగేళ్లలో దాని కాలుష్యంపై పెద్దగా పట్టించుకోలేదు. పోగా ఇది మరింత దరిద్రంగా అంటే మరింత కాలుష్య కూపంగా మారింది. ఇటీవలి వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసిన ఆనందం కన్నా,  నిమజ్జనం తరవాత అది ఎంతగా కాలుష్య కేంద్రంగా మారిందో దాని చుట్టుపక్కల వెళ్లే వారికి తెలుస్తుంది. కంపు కొడుతూ ముక్కులు మూసుకునే స్థితి నుంచి మార్పు రాలేదు. తీసుకోవాల్సిన చర్యలు చూస్తుంటే  బెంబేలెత్తించేలా ఉన్నాయి.  వినాయక నిమజ్జనంతో చెత్తాచెదారం పేరుకుపోయి కాసారాలన్నీ కాలుష్యంగా తయారయ్యాయి.  హుస్సేన్‌ సాగర్‌, సరూర్‌ నగర్‌, సఫిల్‌గూడ లాంటి చెరువుల్లో కాలుష్యం పేరుకుని
పోయింది. ఇందులో చెత్తను తొలగించ వచ్చేమో కానీ ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ లాంటి కాలుష్యాన్ని తొలగించు కోలేక పోతున్నాం. ఏటా ఇలాంటి వ్యర్థాల వల్ల ఇప్పుడు చెరువులన్నీ ఎందుకూ పనికిరాకుండా కాలుష్య నీటితో నిండి పోతున్నాయి. దీనికి పరిష్కారం ఆలోచించాలి. హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళను వందల కోట్లు ఖర్చు చేసినా చుక్కనీటిని కూడా శుభ్రం చేసిన దాఖలాలు లేవు. పాలకుల్లో చిత్తశుద్ది లేదనడానికి ఇదొక్క ఉదాహరణ మాత్రమే. నగరం నడిబొడ్డున ఉన్న ఈ తటాకాన్ని బాగు చేయాలేమా అన్నది ఆలోచించాలి.  దీనికి కేటాయించిన నిధులు నీళ్లలో పోసిన పన్నీరుగా మారుతున్నాయే తప్ప లాభం లేకుండా పోతోంది. హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళనకు కంకణం కట్టుకున్నానని చెప్పిన సిఎం కెసిఆర్‌ నాలుగు న్నరేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నా కఠిన చర్యలు తీసుకోలేదు. అధికారుల్లో జవాబుదారీతనం లేకపోతే ఇలాగే జరుగుతుంది. పాలకులు కఠినంగా లేకుంటే పనులు జరగవని గుర్తించాలి. అలాగే చిన్నపాటి విమర్శలతో పెద్ద సంకల్పాన్ని  పక్కన పెట్టరాదు. మన హుస్సేన్‌ సాగర్లో హైదరాబాద్‌ చుట్టూ ఉన్న పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్యం చేరుతోంది. దీంతో సాగర్‌ పరిసరాలకు వెళ్లాలంటేనే దుర్గంధంగా మారింది. ఇలాంటి దశలో దీని సమూల ప్రక్షాళనకు సిఎం కెసిఆర్‌ చర్యలకు ఉప్రకమించగానే విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటి విమర్శలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. కాలుష్యం తొలగించామా లేదా అన్నదే ముఖ్యం. అందుకు ఎంతటి కఠిన చర్యలకైనా వెనకాడరాదు. వినాయక నిమజ్జనాలతో కాలుష్యం వస్తుందనుకుంటే వాటిని ఆపేయాలి. అలాంటి కఠిన నిర్ణయాలతో జలాశయాలను పరిరక్షించు కోవాలి. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతించినప్పుడే అందులోని వ్యర్థాలను ఏం చేస్తారన్నది అధికారులకు తెలుసు. అయినా అనుమతులు ఇస్తూ పోవడం వల్లనే ఇవాళ హుస్సేన్‌ సాగర్‌ కావచ్చు కాలుష్య కారకాలకు కేంద్రంగా మారుతున్నాయి. కాలుష్యకార పరిశ్రమల వల్ల  నదీజలాల్లో క్రోమియం, కాడ్మియం, సీసం, కోబాల్ట్‌ వంటివి వచ్చి చేరుతున్నాయి. భూగర్భ జలాలకు సైతం ఈ కాలుష్యం అంటుతోంది. చివరకు తినే తిండి కూడా కలుషితమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం కఠిన చర్యలు తీసుకోకుంటే భవిష్యత్‌ మరింత ప్రమాదకరంగా మారగలదని గుర్తుంచుకోవాలి.