ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పండి

– ఏపీపై కేంద్రం వివక్ష చూపుతుంది
– కేంద్రానికి పంపిన యూసీపై నీతిఆయోగ్‌ ఇప్పటి వరకు ప్రశ్నించలేదు
– కానీ బీజేపీ నేతలు యూసీలు తప్పనడం హాస్యాస్పదం
– ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు
అమరావతి, మే31(జ‌నం సాక్షి) : భాజపా పాలిత ప్రాంతాలకు నిధుల వరద పారిస్తున్న కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆంధప్రదేశ్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ-చెన్నై కారిడార్‌కు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. తామిచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సక్రమంగా వినియోగించుకోవడం లేదని భాజపా నేతలు చెప్పడం సరికాదన్నారు. కృష్ణపట్నం పోర్టుకు ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇచ్చారా.. లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సర్దార్‌ వల్లభాయ్‌ విగ్రహానికి వేల కోట్ల నిధులు ఇస్తున్న కేంద్రం.. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి సాయం చేయమంటే మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం నిర్మాణ బాధ్యతలను బుర్జ్‌ ఖలీఫా కట్టిన విదేశీ సంస్థకు అప్పగించారని.. ఆలాంటిది అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దనున్న అమరావతి డిజైన్లు మాత్రం సింగపూర్‌ సంస్థకు అప్పగిస్తే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రానికి పంపిన యూసీలపై నీతిఆయోగ్‌ ఇప్పటివరకు ప్రశ్నించలేదని.. తప్పు అని చెప్పలేదన్నారు. కానీ భాజపా నేతలు మాత్రం యూసీలు తప్పులతడకగా ఉన్నాయని ఆరోపిస్తున్నారని అన్నారు