ఏపీలో అవినీతి రహిత పాలన భాజపాతోనే సాధ్యం
– తెదేపా అసత్య ప్రచారాలను తిప్పికొడతాం
– భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
శ్రీకాళహస్తి, మే29(జనం సాక్షి: ఆంధప్రదేశ్‌లో అవినీతి రహిత పాలన అందించడం భాజపాకే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీవారి దర్శనం కోసం నెల్లూరు నుంచి తిరుమల వెళ్తున్న ఆయనకు శ్రీకాళహస్తిలో భాజపా నాయకులు ఘనస్వాగతం పలికారు. నాయుడుపేట బైపాస్ రోడ్డు కూడలి నుంచి పట్టణ వీధుల గుండా ఏపీ సీడ్స్ కూడలి వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏపీ సీడ్స్ కూడలిలో భాజపా పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం కన్నా మాట్లాడుతూ.. సొమ్ము ఒకరిది – సోకు ఒకరిది అన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రావిూణ ప్రాంతాలు, శ్మశాన వాటికలు, మరుగుదొడ్లను అభివృద్ది చేస్తుంటే వాటికి చంద్రన్న పేరు పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రాన్ని పూర్తిస్ధాయిలో భాజపా అభివృద్ది చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించిందని, మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం సహకరించిందన్నారు. అయినా చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి వైదొలగి ఇప్పుడు మొత్తం కేంద్రమే చేసిందని చెప్పటం సిగ్గు చేటన్నారు. రానున్న కాలంలో ఏపీకి కేంద్రం చేసిన అభివృద్ధితో ప్రజల్లోకి వెళ్తామని, రాబో యే కాలంలో తెదేపా తీరు, వారు చేసే అసత్య ప్రచారాలను ప్రజలకు వివరిస్తామన్నారు. 2019లో తెదేపాకు గుణపాఠం తప్పదని అందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.