ఏపీలో బీజేపీ కుట్రలను సాగనివ్వం
– కేంద్రం అడుగడుగునా అవమానిస్తోంది
– ఏపీపై సవతితల్లి ప్రేమను చూపుతుంది
– పరిస్థితులు చూస్తుంటే ‘ఆపరేషన్ గరుడ’ నిజమేననిపిస్తుంది
– కుట్ర రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– మోదీ మాటల ప్రధాని మాత్రమే
– గుజరాత్‌కు ఓ న్యాయం.. ఏపీకి ఓ న్యాయమా?
– బీజేపీ, వైసీపీలు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయి
– బీజేపీతో తెగదెంపులు చేసుకోగానే పవన్‌కు టీడీపీ అవినీతి గుర్తుకొచ్చిందా?
– ఉత్తరాంధ్రలో ప్రజలను పవన్ రెచ్చగొడుతున్నాడు
– ఏపీకి జరిగిన అన్యాయంపై పవన్ ప్రశ్నించరేం?
– టీటీడీపైనా బీజేపీ రాజకీయాలు చేస్తుంది
– రమణదీక్షితులను అడ్డుపెట్టుకొని టీటీడీపై కేంద్రం పెత్తనం చేయాలని చూస్తుంది
– తిరుపతి వెళ్లాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలా?
– అమిత్ షావి పచ్చి అబద్ధాలు
– అమరావతి గొప్ప రాజధాని అవుతుందని అడ్డుపడుతున్నారు
– బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.
– పెట్రోల్‌పై పైసా తగ్గించడం ప్రపంచంలోనే పెద్ద జోక్
– నవ నిర్మాణ దీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు
విజయవాడ, జూన్2(జనం సాక్షి) : ఏపీలో బీజేపీ కుట్ర రాజకీయాలను సాగనివ్వబోమని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి కుట్ర రాజకీయాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శనివారం విజయవాడ బెంజ్ సర్కిల్‌లో నవ నిర్మాణ దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా డీవీ మ్యానర్ నుండి చంద్రబాబు ర్యాలీగా బెంజ్‌సర్కిల్ వరకు కాలినడకన చేరుకున్నారు. అనంతరం ప్రజలతో ‘ప్రతిజ్ఞ బూనుదాం – ప్రగతి సాదిద్దాం’ నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడిన చంద్రబాబు కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
మోదీ తీరుతో బ్యాంకింగ్ వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు ఇస్తామని హావిూ ఏమైందని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో చిన్నా, పెద్ద తేడా లేకుండా వ్యాపారులను వేధిస్తున్నారని అన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని…అసలు స్వామినాథన్ కమిటీ సిఫారసులను ఎందుకు అమలు చేయరని నిలదీశారు. మోదీ అస్తవ్యస్తపాలనతో 10రాష్ట్రాల్లో రైతుల ఆందోళనలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ పేరుతో కేసులు పెట్టాలని చూశారని…ట్రిపుల్ తలాక్‌లో కేసులు వద్దని అడ్డుకున్నానని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు లభ్యంకావడం లేదని అన్నారు. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా అమలుకావడం లేదని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ చేతల ప్రధాని కాదు.. మాటల ప్రధాని మాత్రమే అని వ్యాఖ్యానించారు.
గుజరాత్‌కో న్యాయం.. ఏపీకో న్యాయమా..?
విభజన చట్టంలోని హావిూలను అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిని కాంక్షించే తాను బీజేపీతో చేరామని చంద్రబాబు అన్నారు. కానీ కేంద్రం అడుగడుగునా మోసం చేసుకుంటూ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా నాలుగేళ్లు ఓపికపట్టి చూశామని.. లాభం లేక బయటకు వచ్చామని చంద్రబాబు తెలిపారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామన్నారని, రాజధానికి నిధులు ప్రకటించకుండా మోదీ మట్టి-నీరు ఇచ్చి వెళ్లిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌పై ఉన్న అభిమానం ఏపీపై లేదని… ధొలేరాపై ఉన్న ప్రేమ అమరావతిపై లేదన్నారు. రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చి రూ.2500 కోట్లు ఇచ్చామని, యూసీలు పంపలేదని అమిత్ షా పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. అమరావతి గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుందని మోదీకి సింగపూర్ ప్రధాని చెప్పారని సీఎం తెలిపారు. విశాఖ రైల్వేజోన్‌పై మాయమాటలు చెబుతూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఒడిశా ఒప్పుకున్నా రైల్వేజోన్ ఇవ్వడం లేదన్నారు. విద్యాసంస్థలకు అరకొర నిధులే కేటాయిస్తున్నారని సీఎం తెలిపారు. చట్టంలో ఉన్న పెట్రో కారిడార్ ఏర్పాటు చేయమని అడిగితే రూ.5500 కోట్లు ఇవ్వాలంటున్నారని చెప్పారు. తాము డబ్బులు ఇస్తే తమరు చేసేదేంటని సీఎం నిలదీశారు. దుగరాజపట్నం పోర్ట్, కడప ఉక్కుఫ్యాక్టరీపై అతీగతీ లేదన్నారు. విజయవాడ, విశాఖ మెట్రో లాభదాయకం కాదంటున్నారన్నారు. రాష్ట్ర అకౌంట్‌లో డబ్బులు వేసి వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. షెడ్యూల్ 9,10 సంస్థల విభజనను పట్టించుకోవడం
లేదని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. హిందూస్థాన్ పెట్రోలియం ర్గి/నైరీకి నిధులిస్తే ఇక కేంద్రం చేసే సాయమేంటని అడిగారు. ఆంధ్రప్రదేశ్‌పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని, లాభాలు లేని ఢిల్లీ-ముంబయి బుల్లెట్ రైలుకు నిధులు ఎలా ఇస్తారన్నారని, ఇక్కడ మెట్రో రైలు అడిగితే ఆర్థికంగా గిట్టుబాటు కాదంటున్నారని, ఇచ్చిన డబ్బులు వెనక్కు తీసుకోవడమేంటని, ఆ అధికారం కేంద్రానికి లేదని మండిపడ్డారు. తెలుగుదేశం బలపడుతుందని నియోజకవర్గ సీట్లు పెంచలేదని, భావితరాల భవిష్యత్ కోసం ప్రధాని చుట్టూ ఓపిగ్గా తిరిగానని, మోడీ గుండె కరగలేదని బాధను వ్యక్తం చేశారు.
కేంద్రం నుంచి విడిపోగానే పవన్‌కు టీడీపీ అవినీతి గుర్తొచ్చిందా?
ఆనాడు స్వాతంత్య ఉద్యమానికి కొందరు తూట్లు పొడిచారని.. ఇప్పుడు ఏపీ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇన్నాళ్లు కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్‌కు టీడీపీ అవినీతి కనపించలేదని.. కేంద్రంతో విభేదించాక టీడీపీపై పవన్ విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో ప్రజలను పవన్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. విభజన సమయంలో పవన్ ఏనాడైనా స్పందించారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పవన్ మాట్లాడరా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని బీజేపీ అస్ధిరపర్చాలని చూస్తోందని, రాయలసీమ డిక్లరేషన్‌తో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తోందని విమర్శించారు. చివరకు టీటీడీపై కూడా బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీటీడీని కేంద్రం పురావస్తుశాఖ ఆధీనంలోకి తీసుకోవాలని చూసిందని అన్నారు. తిరుమలకు వెళ్లాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాలా అని బాబు ప్రశ్నించారు. వారణాసి, తిరుమలకు ఏమైనా పోలిక ఉందా అని అడిగారు. ఎంతో పరిశుభ్రమైన ప్రాంతం తిరుమల అని పేర్కొన్నారు. రమణ దీక్షితులుతో టీటీడీపై ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆపరేషన్ గరుడ అమలుచేస్తున్నారని అనిపిస్తోందని…అయినా ఏపీలో తమ కుట్ర రాజకీయాలు సాగనివ్వబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీతో బీజేపీ రహస్య ఒప్పందం..
వైసీపీతో బీజేపీ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం, రాజీనామాలు అంటూ వైసీపీ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. పార్లమెంటులో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 100మంది ఎంపీలు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ఎంపీలను అడ్డుపెట్టుకుని పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసంపై చర్చ రాకుండా చేశారని సీఎం చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు.
ఏమిచ్చారని అవతరణ దినోత్సవాలు జరుపుకోవాలి..
అన్ని రాష్ట్రాలు అవతరణ దినోత్సవాలను జరుపుకొంటున్నాయని.. మనకు ఏమి ఇచ్చారని దినోత్సవాలను జరుపుకోవాలని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షోభాలను అవకాశాలుగా మలచుకొని ముందుకెళ్తున్నామని అన్నారు. విభజన నష్టాన్ని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ముందుకొచ్చామని పేర్కొన్నారు. దేశంలోనే ఏపీని నెం.1 రాష్ట్రంగా తయరు చేసే శక్తి, సామర్థ్యం తెలుగువారికి ఉందని వెల్లడించారు. అభద్రతా భావంలో ఉన్న ప్రజలకు విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.తొలిసారిగా గోదావరి-కృష్ణా నదుల అనుంసంధానం చేశామని సీఎం గుర్తుచేశారు. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు జూన్‌లోనే నీళ్లు ఇచ్చామని చెప్పారు. 5నదులను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చి భద్రత కల్పించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు.