ఏపీ అంటే వ్యవసాయంలో నెం.1అనాలి
– 2024నాటికి ఏపీని ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి
– ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
– గుంటూరులో ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర స్థాయి సదస్సు
గుంటూరు, జూన్2(జనం సాక్షి) : ఒకప్పుడు ఏపీ అంటే సాంకేతికతలో నంబర్1అనేవారని, ఇప్పడు ఆంధప్రదేశ్ అంటే వ్యవసాయంలో నంబర్1 అనాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. 2024 నాటికి ఆంధప్రదేశ్‌ను ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్టు చెప్పారు. గుంటూరులోని ఏఎన్‌యూ ఎదురుగా జరిగిన పెట్టుబడి రహిత ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. 60లక్షల మంది రైతుల్ని ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సదస్సుకు 7వేల మంది రైతులతో పాటు 20 దేశాల నుంచి ప్రకృతి వ్యవసాయ నిపుణులు హాజరయ్యారు. సదస్సు వేదికగా ఏపీ ప్రభుత్వం, సస్టైనబుల్ ఇండియా ఫైనాన్స్ ఫెసిలిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. 2018లో ఏపీ ప్రకృతి సేద్య రాష్ట్రంగా ఉంటుందన్నారు. ఈ ఏడాదంతా దీనిపైనే దృష్టి పెడతామన్నారు. దీనికి రూ.16వేల కోట్లు ఖర్చవుతుందని, నిధుల సవిూకరణ ఎలా చేయాలనేది ఆలోచిస్తున్నామన్నారు. ప్రపంచమంతా ప్రకృతిసాగు వైపు మరలుతోందని, ప్రకృతి సేద్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ సంస్థలు ముందుకొచ్చి ప్రకృతి సేద్యంపై రాష్ట్రంతో భాగస్వామ్యం వహిస్తున్నాయన్నారు. ఈ సేద్యం ద్వారా ప్రపంచానికి మంచి సందేశం ఇవ్వాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, ఉద్యానవనం, మత్స్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 18శాతం వృద్ధి సాధించినట్టు చెప్పారు.