ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
– రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కొస్గి మండల డీటీ
– ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు
మహబూబ్‌నగర్, మే5(జనం సాక్షి ) : ఏసీబీ వలలో అవినీతి చేప చిక్కింది. మహబూబ్‌నగర్ జిల్లా కొస్గీ మండలంలో ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న కృష్ణమోహన్‌ను శనివారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొస్గీ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగంలో డీటీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణమోహన్, మద్దూరు, గండేడ్, దామరగిద్ద మండలాలకు సైతం ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గండేడ్ మండల పరిధిలోని 34 రేషన్ షాపుల్లో 260 క్వింటాళ్ల బియ్యానికి సంబంధించి ఆవకతవకల జరిగాయి. అట్టి నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వకుండా ఉండేందుకు సదరు రేషన్ డీలర్ల నుంచి కృష్ణమోహన్ రూ.7లక్షలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. కాగా ఇంతిచ్చుకోలేమని రేషన్ డీలర్లు పేర్కొనడంతో మధ్యవర్తుల ద్వారా చర్చలు జరిపిన కృష్ణమోహన్ అనంతరం డీలర్లు రూ 5లక్షలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కృష్ణమోహన్ తీరుపై అప్పటికే రగిలిపోతున్న డీలర్‌లు అతని అవినీతిని బట్టబయలు చేయాలని భావించారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని పలువురు డీలర్లు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముందుగా రూ. లక్ష ఇస్తామని, ఎక్కడ ఇవ్వమంటారో కృష్ణమోహన్‌ను అడగాలని డీలర్లకు సూచించారు. ఏసీబీ అధికారుల సూచనతో ఒప్పందంలో భాగంగా ముందస్తుగా లక్ష రూపాయలు ఇస్తామని కృష్ణమోహన్‌కు చెప్పారు. దీంతో జిల్లా కేంద్రంలోని తన ఇంటికి డబ్బుతీసుకొని రాండి అని కృష్ణమోహన్ తెలపడంతో శనివారం జిల్లా కేంద్రంలోని తన ఇంటి వద్ద డీలరు నుంచి లక్ష రుపాయాలు ఇచ్చేందుకు తీసుకెళ్లారు. అప్పటికే నిఘా పెట్టి ఉంచిన ఏసీబీ అధికారులు డీలర్లు సదరు డీటీకి లక్ష ఇస్తున్న క్రమంలో ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. దీంతో కృష్ణమోహన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కృష్ణమోహన్ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన అనంతరం ఏసీబీ కోర్టులో హజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.