ఐటిడిఎ ద్వారా గిరిజనులకు స్వయం ఉపాధి
కోటితో పథకాలు చేపట్టిన ప్రభుత్వం: మంత్రి వెల్లడి
నిర్మల్,నవంబర్2(జనంసాక్షి): గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా వారికి ఆదాయం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గిరిజన సహకార సంస్థ ద్వారా గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అటవీ ఉత్పత్తులను సేకరించిడమే కాకుండా గిరిజనులతోనే ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వహించి వారి ద్వారానే మార్కెటింగ్ చేయించి వచ్చే ఆదాయాన్ని వారికే చెందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తద్వారా గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గిరి తేనె, సహజ సిద్ధమైన సబ్బులు, షాంపూలు, శానిటైజర్ల తయారీతో బహిరంగ మార్కెట్‌లో జీసీసీ తనదైన ముద్ర వేసిందన్నారు. అందుకే వీటి ఏర్పాటుకు ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన సబ్బుల తయారీ పరిశ్రమను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరిశ్రమల స్థాపనతో గిరిజనులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. గిరిజన మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో కలిసి గిరి తేనె ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ డా. క్రిష్టినా జెడ్ చోంగ్తు, ఊట్నూరు ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా, జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఇంచార్జి డీఆర్వో రాథోడ్ రమేష్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.