ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ) కొట్టివేత

c79a37d6ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ)పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్టింగ్‌ల ఆధారంగా అరెస్టులు చేయడాన్ని అత్యున్నత న్యాయ స్థానం తప్పుపడుతూ.. 66(ఏ)ను కొట్టివేసింది. రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతంలా ఉందని కోర్టు అభిప్రాయపడింది. లా విద్యార్ధిని శ్రేయా సింఘాల్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ కీలకమైన తీర్పునిచ్చింది. 66(ఏ) గతంలో కూడా వివాదాస్పదంగా మారింది. శివసేన అధినేత బాల్‌ థాక్రే చనిపోయినప్పుడు బంద్‌ చేయడాన్ని ఫేస్ బుక్‌లో ప్రశ్నించిన యువతిని, ఆ పోస్టుకు లైక్ కొట్టిన మరో యువతిని కూడా అరెస్ట్ చేశారు. దాంతో వారిద్దరి అరెస్ట్‌ ను ప్రశ్నిస్తూ.. 66(ఏ) సెక్షన్‌ను రద్దు చేయాలని శ్రేయా సింఘాల్ పిల్ దాఖలు చేశారు. ఈ సెక్షన్‌ కింద మూడు సంవత్సరాల శిక్ష పడే అవకాశముంది. అయితే పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా ఉన్న ఐటీ చట్టంలోని 66(ఏ) సెక్షన్‌ను కొట్టివేసింది.