ఐటీ రంగంలో దూసుకుపోతున్నాం
– వృద్ధిరేటు సాధించాం
– వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్,జూన్ 15(జనంసాక్షి):ఐటీశాఖ వార్షిక నివేదికను తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో మంచి వృద్ధిరేటు సాధించామని తెలిపారు.2014-15లో ఐటీ ఎగుమతులు రూ.67వేల కోట్లు ఉండేవని, 2015-16లో ఎగుమతులు రూ.75వేల కోట్లు దాటాయని వెల్లడించారు. జాతీయ సగటు కన్నా ఒకశాతం ఎక్కువగా వృద్ధి సాధించామన్నారు.నిపుణుల సలహాతో ఐటీ విధానం ప్రకటించామని, యానిమేషన్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో కూడా విధానం ప్రకటించామని చెప్పారు. మొదటి సంవత్సరం తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ కోసం కృషి చేశాం, అన్ని దేశాలతో హైదరాబాద్‌ను బేరీజు వేసి పలు సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. యువతకు ఉద్యోగాలు రావాలని టాస్క్ కార్యక్రమం ప్రారంభించాం. టాస్క్ ద్వారా 45వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. టాస్క్‌ను బహుముఖంగా.. జిల్లాల వారీగా విస్తరిస్తామన్నారు. కేవలం హైదరాబాద్‌కే ఐటీ రంగం పరిమితం కాకూడదని సీఎం చెప్పారని గుర్తు చేశారు.
ఐటీని ద్వితియ శ్రేణి పట్టణాలకు తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషి ఫలితాలను ఇస్తోందన్నారు. చిన్న చిన్న పట్టణాలలో కూడా రూరల్ బీపీవోలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వంలోని 26 విభాగాలు విస్తృతంగా ఐటీ విధానాన్ని వినియోగిస్తున్నాయని, విూసేవ ద్వారా మరిన్ని సేవలు అందించాలని కృషి చేస్తున్నట్లు చెప్పారు. విూసేవను గ్రావిూణ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ-పంచాయతీలను ప్రారంభిచామని చెప్పారు. గతేడాది లక్షమంది డిజిటల్ అక్షరాస్యతను సాధించారని వెల్లడించారు. సిలికాన్ వ్యాలీలో కూడా టీ హబ్ గుర్తింపు పొందిందని, సిలికాన్ వ్యాలీలో టీహబ్ ఔట్‌పోస్టును ప్రారంభిస్తామన్నారు. టీహబ్‌తో గూగుల్, మైక్రోసాఫ్ట్, సిస్కోలాంటి సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తతదితరులు పాల్గొన్నారు. డిజిటల్ అక్షరాస్యత సాధించిన ముగ్గురు సర్పంచ్‌లకు అవార్డులు ప్రదానం చేశారు. తెలంగాణ పల్లెసీమలు సాంకేతిక అక్షరాస్యత సాధించేందుకు తెలంగాణ ఐటీ అసోసియేషన్ సామాజిక బాధ్యతతో చేస్తున్న కృషి పై ఐటి శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పల్లెల్లో సాంకేతిక వెలుగులను పంచుతున్న టిటా తో పాటు ఆదిలాబాద్ జిల్లా బాసర, నిజామాబాద్ జిల్లాలోని నర్సింగాపూర్ సర్పంచులను వంద శాతం సాంకేతిక అక్షరాస్యత సాధించిన గ్రామాలుగా మంత్రి ప్రశంశ పత్రాలతో అభినందిచారు.గ్రావిూణ స్థాయిలో సాంకేతికత వినియోగంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం.. పనులు వేగంగా, సులువుగా పూర్తిచేసేందుకు డిజిటల్ తెలంగాణ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ అసోసియేషన్ కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డిజిథాన్ పేరుతో పల్లెవాసులను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బాసర, నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి నియోజకవర్గంలోని నర్సింగాపూర్ గ్రామాలను పూర్తి స్థాయి డిజిటల్ లిటరసీ గ్రామాలుగా తీర్చిదిద్ది మంత్రి కేటీఆర్ ప్రశంసలు అందుకున్నారు.ఐటీ ఫలాలను గ్రావిూణ స్థాయికి అందించే లక్ష్యంతో టిటా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టింది. చదువుల తల్లి కొలువుదీరిన బాసరలో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏడు ఆదివారాలు గ్రామంలో ఉన్నవారందరికీ ఐటీ పాఠాలు చెప్పి, మొట్టమొదటి డిజిటల్ గ్రామంగా బాసరను తీర్చిదిద్దింది. దీంతోపాటు నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి నియోజకవర్గంలోని నర్సింగాపూర్ నూ పూర్తిస్థాయి డిజిటల్ లిటరసీ గ్రామంగా మార్చింది. ప్రపంచ అవసరాలకు అనుగుణంగా పంటలు పండించడం.. వాటిని అమ్ముకోడానికి ఇంటర్నెట్ ను వినియోగించుకునేలా శిక్షణ ఇచ్చింది. కరెంటు, టెలిఫోను, ఇంటి పన్ను చెల్లింపులు, బ్యాంకు లావాదేవీలన్నీ ఆన్ లైన్ లో నిర్వహించుకోవడంపై గ్రావిూణులకు అవగాహన కల్పించింది.తొలుత కంప్యూటర్ ప్రాథమికాంశాలు నేర్పించి.. వారితో గ్రామస్తులకు శిక్షణ ఇప్పించేలా సిద్ధం చేశారు. రెండు గ్రామాల్లోనూ శిక్షణ పొందిన వారిలో గృహిణులు, బీడీ కార్మికులు, వ్యవసాయదారులు, దుకాణదారులు, విద్యార్థులు ఉన్నారు. శిక్షణ పూర్తిచేసుకొని పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లిటరసీ మిషన్-టిటాతో కూడిన సర్టిఫికెట్ ను అందించారు. డిజిథాన్ పేరుతో మొదటి దశలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నామని టిటా వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాలా తెలిపారు. మంత్రి కేటీఆర్ సహకారంతో త్వరలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపడుతామని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో టిటా తమ గ్రామంలో వంద శాతం డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దినందుకు సంతోషంగా వుందని బాసర, నర్సింగాపూర్ సర్పంచులు అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సామాన్యుల చెంతకు చేర్చేందుకు టిటా చేస్తున్న కృషిని ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.