ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రారంభం
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణతో పాటు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు అధికారులు ప్రారంభించారు. ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 8,500 మందికిపైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి.
తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 1,821 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.81 కోట్ల మంది ఓటర్లలో 73.2 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అత్యధికంగా హైదరాబాద్ నగరంలో 13 ప్రాంతాల్లో, మిగిలినవి ఒక్కో జిల్లాలో ఒక్కో లెక్కింపు కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. ఇక్కడ మళ్లీ అధికారంలో రావాలని తెరాస భావిస్తుండగా.. తమదే విజయమని ప్రజాకూటమి ధీమా వ్యక్తంచేస్తోంది.
* మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు నవంబర్ 28న పోలింగ్ జరుగగా, 2 వేలకు పైగా మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. భాజపా అన్ని సీట్లకూ పోటీ చేయగా, కాంగ్రెస్ 229 స్థానాల్లో బరిలో నిలిచింది. ఒక సీటును శరద్‌యాదవ్ నేతృత్వంలోని లోక్‌తాంత్రిక్ జనతాదళ్‌కు వదిలేసింది. బీఎస్పీ 227 స్థానాల్లో, ఎస్పీ 51 స్థానాల్లో, ఆప్ 208 స్థానాల్లో పోటీపడ్డాయి. 1,094 మంది స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 75.05 శాతం పోలింగ్ నమోదయింది.
* ఛత్తీస్‌గఢ్‌లో 90 సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 12, 20 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది. 76.60 శాతం ఓటింగ్ నమోదైంది. 1,079 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
* రాజస్థాన్‌లో 199 స్థానాలకు డిసెంబర్ 7న పోలింగ్ జరిగింది. 74 శాతం ఓటింగ్ నమోదైంది.
* మిజోరంలో నవంబర్ 28న జరిగిన 40 స్థానాలకు గాను సుమారు 80 శాతం దాకా పోలింగ్ నమోదైంది.
మిజోరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో భాజపా నాలుగోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు యత్నిస్తుండగా, రాజస్థాన్‌ను మరోసారి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌కు కూడా ఈ ఎన్నికలు కీలకమే. మూడు రాష్ట్రాల్లో భాజపా అధికారాన్ని సవాలు చేయడమే కాకుండా, మిజోరంలో అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.