ఐదేళ్లలో ప్రతి ఇంటికి నిరంతరాయంగా విద్యుత్‌, వంటగ్యాస్‌లో రాయితీ

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 9 (జనంసాక్షి): భారత్‌ ఎదుర్కొంటున్న సమస్యల్లో విద్యుత్‌ సమస్య కూడా ప్రధానమైందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. విద్యుత్‌ సంక్షోభం ఒక్క భారత్‌లోనే కాదని, ప్రపంచమంతా ఉందన్నారు. అయితే, వచ్చే ఐదేళ్లలో అన్ని గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తాంచడంతో పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని ప్రధాని హావిూ ఇచ్చారు. విద్యుత్‌ అంశంపై కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సును మన్మోహన్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన సదస్సులో ప్రసంగిస్తూ.. భారత్‌లో ఇంకా అనేక గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ఆరు లక్షల  గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలన్నది తమ లక్ష్యమని వివరించారు. ఇటీవలి కాలంలో లక్షకు పైగా గ్రామాలకు కరెంట్‌ సదుపాయం కల్పించామన్నారు. ఇంకా కొన్ని వేల గ్రామాలు విద్యుత్‌ సౌకర్యానికి నోచుకోలేదని తెలిపారు. వాటికి కూడా త్వరలోనే విద్యుత్‌ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో గృహావసరాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలన్నది తమ లక్ష్యమని ప్రధాని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 1.3 బిలియన్ల ప్రజలు ఇంకా కరెంట్‌ సౌకర్యానికి నోచుకోలేదని అన్నారు. ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే యూఎన్‌ మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎండీజీ)లో చేర్చిందన్నారు. భారత్‌లో శక్తివనరులు లేక గ్రావిూణ మహిళల్లో 80 శాతం మంది.. చీకట్లు నిండుకున్న వంటింట్లో కట్టెలు పొయ్యిలు వినియోగిస్తున్నారని చెప్పారు. విద్యుత్‌ ఉత్పత్తి మెరుగుదలకు ప్రభుత్వం, పరిశ్రమలు పరస్పరం సహకరించుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.