ఐవరీకోస్ట్‌లో తొక్కిసలాట:60మంది మృతి

అబిద్‌జన్‌: జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుకొని అబిద్‌జన్‌లో రాత్రంతా బాణసంచా వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 60మంది మరణించారు. డజన్ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని ఐవరీ కోస్ట్‌ సహాయక చర్యల సిబ్బంది. మంగళవారం తెలిపారు. ప్రాథమిక అంచనా మేరకు 60మంది మరణించగా, మరో 200మంది ప్రజలు గాయపడ్డారని సైనిక సహాయక చర్యల సిబ్బంది అధినేత లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ఇస్సా సాకో ప్రభుత్వ నిర్వహణలో టీవీ చానెల్‌కు తెలిపారు. ”61మంది మరణించగా, మరో 48మంది ప్రజలు గాయపడ్డారు” అని మరో అధికారి ఈ వార్త ప్రతినిధికి తెలిపారు. గాయపడినవారిని వైద్యశాలలకు తరలించినట్టు అధికారి తెలిపారు. తొక్కిసలాటలో అనేక మంది బాలలు గాయపడ్డారు. నగరంలో ప్రధాన స్టేయంలో బాణసంచా ప్రదర్శనను తిలకించే నిమిత్తం స్టేడియం ప్రధాన ద్వారం వద్దకు జనం పోటెత్తడంతో అతి పెద్ద తొక్కిసలాటకు దారి తీసిందని సాకో వివరించారు. తొక్కిసలాటలో కిందపడిన వారిపై ఇతరులు నడుచుకుంటూ వెళ్లారు. ఊపిరాడక జనం ఉక్కిరి బిక్కిరయ్యారు. అని ఆయన తెలిపారు. మైదానంలో మృత దేహాలు పడి ఉండటాన్ని ఆర్‌టీఐ టెలివిజన్‌ ప్రసారం చేసింది. చెప్పులు, వస్త్రాలు మైదానంలో అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. అదే చోట సైనికులు, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.