ఐసీయూలో ఉన్న వైసీపీకి బీజేపీ ఆక్సిజనిస్తోంది
– వైసీపీకి ఓట్లేస్తే బీజేపీకి వేసినట్లే
– ఉద్దానంలో ఏవిూ చేయలేదనంటం అవివేకం
– తిరుపతి వెంకన్నను రాజకీయంగా వాడుకుంటున్నారు
– ఆయనతో పెట్టుకుంటే పుట్టగతులుండవ్
– దమ్ముంటే నాపై ఆరోపణలకు ఆధారాలు చూపించండి
– ఎన్టీఆర్, చంద్రబాబులకు ఎప్పటికీ చెడ్డపేరు తేను
– రాష్ట్రంలో 17వేల కి.విూమేర సీసీ రోడ్లు నిర్మించాం
– మహానాడులో మంత్రి నారా లోకేశ్
విజయవాడ, మే28(జనం సాక్షి ) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందని, కేసుల మాఫీ కోసం వైసీపీ పాట్లు పడుతోందని మంత్రి లోకేశ్ విమర్శించారు. మహానాడులో రెండో రోజైన సోమవారం మంత్రి మాట్లాడుతూ వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. ఉద్దానానికి ఏవిూ చేయలేదనడం సరికాదని, కిడ్నీ వ్యాధి ప్రబలిన చోట ఆర్వోసీ ప్లాంట్లు ఏర్పాటుచేశామని లోకేష్ వెల్లడించారు. తాను ఎప్పుడు… ఎక్కడ తప్పు చేశానో ఆధారాలతో నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. ప్రతపక్ష నేతలు కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాత ఎన్టీఆర్‌కు చెడ్డపేరు తెచ్చే పని ఎప్పటికీ చేయనని
మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించి… మళ్లీ చంద్రబాబును గెలిపించాలని మహానాడులో మంత్రి లోకేశ్ పిలుపు ఇచ్చారు. తిరుపతి వెంకన్న పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, శ్రీవారి జోలికి వెలితే మాడి మసైపోతారని లోకేష్ అన్నారు. రూ.162 కోట్లతో 1750 పంచాయతీ భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. 17వేల కిలోవిూటర్ల మేర సీసీ రోడ్లు వేశామని మంత్రి వెల్లడించారు. ఉపాధి హావిూలో అవినీతి జరుగుతోందని అసత్యప్రచారంచేస్తూ.. కేంద్రం నుంచి నిధులు రాకుండా వైసీపీ నేతలు అడ్డుపడ్డారని లోకేశ్ ఆరోపించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1120 కోట్లు ఇచ్చామన్నారు. 2022 నాటికి ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేస్తామని, పైలెట్ ప్రాజెక్టులుగా పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలకు ఆరు నెలల్లోనే ఇంటింటికి కుళాయి వస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు తెదేపా ప్రభుత్వంపై కుట్రలు, కుతంత్రాలతో ముప్పేట దాడి చేస్తున్నాయని, వాటన్నింని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని లోక్‌ష్ పిలుపునిచ్చారు.