ఒంటరి పోరాటమే: టీఆర్‌ఎస్ ఇక చర్చల్లేవ్.. ఉద్యమమే
తెలంగాణ ప్రాంతంపై సర్కారు వివక్ష
వరంగల్, నవంబర్ 21:రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీతో ఇక పొత్తులు, చర్చలు ఉండబోవని తేల్చి చెప్పింది. కాంగ్రెస్‌కో ఖతం కరో.. తెలంగాణ హాసిల్ కరో నినాదంతో తమ పోరాటం కొనసాగుతుందని టీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన వరంగల్‌లో విూడియాతో మాట్లాడారు. సూర్యాపేట సమరభేరి సభతో మలి దశ ఉద్యమానికి నాంది పలుకుతామని తెలిపారు. తెలంగాణ కోసం ఇకపై కేంద్రం, కాంగ్రెస్‌తో చర్చలు ఉండవని.. మానుకోట తరహా పోరాటాలకు రూపకల్పన చేస్తామని హెచ్చరించారు. మొన్నటివరకు టీఆర్‌ఎస్.. కాంగ్రెస్‌లో విలీనం అవుతుందనే బాధలో ఉన్న తెలంగాణ ప్రజలకు కరీంనగర్‌లో కేసీఆర్ డిక్లరేషన్‌తో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. టీడీపీ అధినేత వందసార్లు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం కన్నా.. తెలంగాణకు అనుకూలమని ఒకసారి ప్రకటిస్తే చాలని అన్నారు. నీలం తుపాను నష్టం అంచనాల్లోనూ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ధ్వజమెత్తారు. నీలం దాటికి ఖమ్మం జిల్లా సహా తెలంగాణలో భారీగా పంట నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం తక్షణమే నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.