ఒకరి మేనిఫెస్టో కాఫీకొట్టే స్థితిలో..  టీఆర్‌ఎస్‌ లేదు


– కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేసిందో చెప్పాలి
– ఉత్తమ్‌ వ్యాఖ్యలతో ప్రజలు నవ్వుకుంటున్నారు
– పాడిపరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
– టీఆర్‌ఎస్‌ 100 సీట్లలో గెలుపు ఖాయం
– డిసెంబర్‌ 11 తర్వాత మళ్లీ ఏర్పాటయ్యేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే
– టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తులను ప్రజలు అసహించుకుంటున్నారు
– విలేకరుల సమావేశంలో తెరాస నేత వినోద్‌ కుమార్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను టీఆర్‌ఎస్‌ కాపీ కొట్టిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పడం సిగ్గుచేటని తెరాస నేత, పార్లమెంటు సభ్యుడు వినోద్‌ కుమార్‌ ఖండించారు. బుధవారం ఆయన తెరాస భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఉత్తమ్‌ చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని అన్నారు. అసలు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు మేనిఫెస్టోను విడుదల చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ బర్రెలు, గొర్రెలు ఇస్తుందా? అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు వేసిన ప్రశ్నకు వినోద్‌ స్పందించారు. తెలంగాణ ప్రజలకు తప్పకుండా గొర్రెలు, పశువులను అందజేస్తామని, పాడిపరిశ్రమను అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. పాడి పరిశ్రమపై ఆధారపడ్డ ప్రజల ఆదాయాన్నిపెంచేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
వీహెచ్‌ తెల్లవారి లేస్తే చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ పాలు, బెంగళూరుకు చెందిన నంది పాలు తాగుతారని ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు, పాడిపరిశ్రమ ద్వారా స్థానికులకు లబ్ధి చేకూర్చేందుకే పశువులను అర్హులకు అందజేస్తున్నామని తెలిపారు. రూ.200 పెన్షన్‌ ఇవ్వని కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు రూ.2వేలు ఇస్తారా? అంటూ ప్రజలు నవ్వుతున్నారని వినోద్‌ అన్నారు.
కాంగ్రెస్‌ నేతలకు ప్రజల్లో తిరిగే అలవాటు లేదని విమర్శించారు. 2014 మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశామని, చెప్పనివి కూడా చేశామని తెలిపారు. ప్రజల దీవెనలు కేసీఆర్‌కు మెండుగా ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌ 100 సీట్లకు పైగా గెలవడం ఖాయమని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 11 తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఓట్ల కోసం మాట్లాడుతున్నారని… తాము ప్రజా సంక్షేమం కోసం మాట్లాడుతున్నామని ఎంపీ వినోద్‌ పేర్కొన్నారు. చంద్రబాబుతో కాంగ్రెస్‌ ఎలా పొత్తు పెట్టుకుంటున్నదో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పాలని వినోద్‌కుమార్‌ డిమాండ్‌చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని వివరించారు. కోర్టులకు కాదు ప్రజాకోర్టుకు వెళ్దామని సీఎం కేసీఆర్‌ అంటే కాంగ్రెస్‌ నేతలు భయపడి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.