ఒక్కరోజు నిరాహార దీక్షచేసిన పవన్‌


– సంఘీభావం తెలిపిన వామపక్ష పార్టీలు
– టీడీపీకి పోయేకాలం దగ్గరపడింది – వామపక్ష నేతలు
శ్రీకాకుళం, మే26(జ‌నంసాక్షి) : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై తాను చేసిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ 24 గంటల దీక్షకు దిగారు. ఎచ్చెర్ల మండలంలోని ఓ ప్రైవేట్‌ రిసార్ట్‌లో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన శనివారం ఉదయం శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఉదయం 9గంటలకు నిరాహార దీక్ష ప్రారంభించారు. సాయంత్రం 5గంటల వరకు పవన్‌ దీక్ష కొనసాగనుంది. శనివారం సాయంత్రం దీక్ష ముగిసిన తరువాత ఆయన ప్రజాపోరాట యాత్ర కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా జనసేన విూడియా ఇన్‌చార్జ్‌ హరిప్రసాద్‌ మాట్లాడుతూ కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్‌ కల్యాణ్‌ 17 డిమాండ్లతో కూడిన ప్రకటన విడుదల చేశారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆరోగ్య ఎమర్జెన్సీ విధించాలని, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి నేరుగా దీనిని పర్యవేక్షించాలని జనసేన డిమాండ్‌ చేసినట్లు వెల్లడించారు. అయితే తమ డిమాండ్లపై ప్రభుత్వ స్పందన లేదన్నారు. కిడ్నీ వ్యాధితో జిల్లాలో రోజుకు ఒకరు మృత్యువాత పడుతున్నా సర్కార్‌ పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. సాంకేతికంగా ప్రగతి సాధించిన ఏపీలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రధాన సమస్యగా మారిందన్నారు.
పవన్‌ దీక్షకు వామపక్షాలు సంఘీభావం..
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేపట్టిన ఒక్కరోజు దీక్ష శిబిరాన్ని వామపక్ష నేతలు మధు, రామకృష్ణ సందర్శించిన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. ఉద్దానం ప్రాంతంలో 20 ఏళ్లలో 60 వేల మంది కిడ్నీ
బాధితులు చనిపోయారని మధు, రామకృష్ణ తెలిపారు. శ్రీకాకుళంకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఇసుక, మైనింగ్‌, మద్యం.. ఇలా అన్నింట్లో మంత్రులు కవిూషన్లు నొక్కుతున్నారని విమర్శించారు. అందుకోసమే రాష్ట్రానికి కొత్త రాజకీయాలు కావాల్సిన అవసరం ఉందన్నారు. పవన్‌ పోరాట యాత్రను ఎవరూ ఆపలేరని చెప్పారు. టీడీపీకి పోయే కాలం దగ్గర పడిందని మధు, రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకొనే స్థితిలో సీఎం, మంత్రులు లేకపోవటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపాలని లేకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.