ఒక ఫ్యామిలీకి ఒక సీటే!
– క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం
– కేవలం ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్‌కే అవకాశం
– ఒక్కొక్కరికి ఒక విధంగా పాలసీ సరికాదంటున్న మిగిలిన నేతలు
హైదరాబాద్, అక్టోబర్13(జనంసాక్షి) : కాంగ్రెస్ పార్టీలో ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు బరిలో ఉండటం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరుగుతూనే ఉంటుంది. కాగా డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల్లోనూ ఆయా నియోజకవర్గాల నుంచి ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు వేరు వేరు నియోజకవర్గాల్లో బరిలోకి దిగేందుకు అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంలోపై స్పందించిన కాంగ్రెస్ అధిష్టానం ఒకే ఫ్యామిలీకి ఒకే సీటు ఉంటుందని సూచన ప్రాయంగా తెలిపింది. కానీ కాంగ్రెస్‌లో కొడుకులను, భార్యలను,
ఇతర కుటుంబ సభ్యులను తమతో పాటు వేరే నియోజకవర్గంలో బరిలో దింపేందుకు కాంగ్రెస్‌లోని రాష్ట్ర అగ్రనేతలు ఢిల్లీలో మంతనాలు సాగించారు. దీనికితోడు ఇటీవల కాంగ్రెస్ నేత రాజనర్సింహ సతీమణి పద్మినిరెడ్డి కాంగ్రెస్‌లో ఉంటే టికెట్ రాదని భావించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం రాజనర్సింహం, కాంగ్రెస్ పెద్దల ఒత్తిడి వెనక్కు తగ్గి సాయంత్ర కల్లా మళ్లీ కాంగ్రెస్లో చేరారు. ఈనేపథ్యంలో అధిష్టానం ఈ విషయంలో కొంత వెనక్కు తగ్గినట్లు కనిపించింది. కాగా ఎవరూ ఊహించని విధంగా ఫ్యామిలీ సీట్లపై కాంగ్రెస్ అధిష్టానం తన నిర్ణయాన్ని మరింత కఠినంగా చేసింది. ఒక స్పష్టంమైన క్లారిటీకి ఇచ్చింది. ఒక ఫ్యామిలీకి ఒక్క సీటే ఇవ్వాలని నిర్ణయించింది. అయితే టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఈ నిబంధననుంచి మినహాయింపు ఇచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు తమతోపాటు తమ కుమారులకు, కుమార్తెలకు సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ కోవలో తనతోపాటు తన కుమారుడికి మిర్యాలగూడ సీటు ఇవ్వాలని జానారెడ్డి కోరుతున్నారు. తన కూతురు స్నిగ్ధారెడ్డికి మక్తల్ సీటు కావాలని డికె అరుణ కోరుతున్నారు. తనకు మహేశ్వరం, తన కుమారుడు కార్తీక్‌కు రాజేంద్ర నగర్ సీట్లు కేటాయించాలని సబితా ఇంద్రారెడ్డి కోరుతున్నారు. తన భార్య పద్మినీ రెడ్డికి సీటు ఇవ్వాలని దామోదర రాజనర్సింహ కోరుతుండగా, తన కుమారుడు అనిల్‌కు ముషీరాబాద్ ఇవ్వాలని అంజన్‌కుమార్ యాదవ్ పట్టుబడుతున్నారు. తనతోపాటు తన కొడుకు విక్రమ్ గౌడ్‌కు మరోసీటును ముఖేష్ గౌడ్ కోరుతున్నారు. కాగా ఉత్తమ్, పద్మారెడ్డి సిట్టింగ్‌లు కావడం వల్లే వారికి మినహాయింపు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీటుతో పాటు తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మునుగోడు సీటు క్లియర్ చేస్తూ అదిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలకు మినహాయింపు ఇచ్చిన మిగిలిన వారికి అదిష్టానం గట్టి హెచ్చరికలు జారీ చేయడం పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉంటే అందరికీ ఒకే నిబంధన ఉండాలని, అలా కాకుండా ఒకరికొక నిబంధనలు ఉండటం ద్వారా పార్టీలో అంతర్గత విబేధాలు ఏర్పడి ఎన్నికల సమయంలో పార్టీకి తీవ్ర నష్టం వస్తుందని పలువురు పేర్కొంటున్నారు.