ఒడిశా మాజీ సీఎం జేబీ పట్నాయక్‌ మృతి

2

తిరుపతి,ఏప్రిల్‌ 21 (జనంసాక్షి):

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, అసోం మాజీ గవర్నర్‌ జానకి వల్లభ పట్నాయక్‌(88) గుండెపోటుతో మృతి చెందారు. తిరుపతిలోని రాష్టీయ్ర సాంస్కృతిక విద్యాపీఠం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సోమవారం అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన తిరుపతి స్విమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం  తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1927లో ఒడిశాలోని కుర్థాజిల్లా రామేశ్వరపురంలో జన్మించిన జేబీ పట్నాయక్‌ 1980-89, 1995-99లో ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1980లో కేంద్ర పర్యాటక, విమానయాన, కార్మికశాఖమంత్రిగా కూడా పనిచేశారు. 2009-14 మధ్య అసోం గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జేబీ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీలో న్యూ జగన్నాథ్‌ సడక్‌ను నిర్మించారు. గత ఏడేళ్లుగా తిరుపతిలోని రాష్టీయ్ర సాంస్కృతిక విద్యాపీఠం ఛాన్సలర్‌ వ్యవహరిస్తున్నారు. సంస్కృత భాషను సరళీకృతం చేయడానికి ప్రపంచంలోని 12 భాషల్లోకి నిఘంటువులు రూపొందించాలని సాంస్కృతిక విద్యాపీఠం ప్రతినిధులను జేబీ పట్నాయక్‌ ఆదేశించారు. 2015 ఆగస్టు 15లోగా పక్రియ పూర్తిచేయాలని కూడా సూచించారు.  రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  జేబీ పట్నాయక్‌ అకాల మరణంతో విద్యాపీఠం వైస్‌ఛాన్సలర్‌ హరేకృష్ణ శతపతి, ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య పీవీ అరుణాచలం, వేదిక్‌ యూనివర్సిటీ మాజీ ఉప కులపతి సన్నిధానం సుదర్శన శర్మ, విద్యాపీఠం రిజిస్టార్‌ ఉమా శంకర్‌, మాజీ

రిజిస్టార్‌ సుబ్బారావు, స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.వెంగమ్మ తదితరులు సంతాపం తెలిపారు. స్విమ్స్‌లో జేబీ పట్నాయక్‌ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జేబీ పట్నాయక్‌ భౌతికకాయాన్ని తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రి నుంచి ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌ తరలించారు. గుండెపోటుతో స్విమ్స్‌లో చేరిన జేబీ పట్నాయక్‌ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. జేబీ పట్నాయక్‌ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

మాజీ ఎంపి సంతాపం

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్‌ మృతి పట్ల తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్‌ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా చింతా మోహన్‌ మాట్లాడుతూ దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయిందని,  దేశ రాజకీయాల్లో జేబీ పట్నాయక్‌ కీలక పాత్ర పోషించారని అన్నారు.

పట్నాయక్‌ మృతికి వైఎస్‌ జగన్‌ సంతాపం

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్‌ మృతికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు.  పట్నాయక్‌ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జేబీ పట్నాయక్‌ గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జేబీ పట్నాయక్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు.