ఒర్రుడు ఆపు నీకు దమ్ముంటే, ఆధారాలుంటే ఫిర్యాదు చేయి

రఘునందన్‌పై ఈటెల ఫైర్‌
హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) :
‘ఒర్రుడు ఆపు.. నీకు దమ్ముంటే.. నీ దగ్గర ఆధారాలుంటే ఫిర్యాదు చేయి’ అంటూ టీఆర్‌ఎస్‌ బహిష్కృతనేత రఘునందన్‌రావుపై ఆ పార్టీ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్‌ విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమయంలో సీమాంధ్రులు డబ్బు సంచులతో, ఉద్యమంలో అసంతృప్తులను కొనుగోలు చేస్తూ నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రులు ఎప్పుడు అసంతృప్తులను చేరదీసి ఉద్యమంపైన, నాయకులపైన, తెలంగాణ ప్రజలపైన విషం చిమ్మించినా కూడా అలాంటి వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారే తప్ప ఉద్యమం గాని, తెలంగాణ ఆకాంక్షగాని, తమ నాయకులు గాని ఇంకా ఇంకా ఎదిగిపోతూనే ఉన్నారన్నారు. ఇప్పటివరకు సీమాంధ్రులు చేసిన ప్రయోగంలో మునిగిపోయినవారు జిట్టా బాలకృష్ణారెడ్డి, కెకె మహేందర్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌ సరసన నేడు రఘునందన్‌రావు చేరిపోయాడని తీవ్రస్థాయిలో ఆరోపించాడు. ఇన్నాళ్లు అనేక రకాల పదవులు పొందిన నీవు ఈసారి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నావో గుండెపై చేయివేసుకుని ఆలోచించుకోవాలని హితవు పలికారు. పదమూడేళ్లపార్టీ చరిత్రలో ఏడేండ్లు జిల్లాకు అధ్యక్షుడిని చేసింది, జడ్పీటిసిని చేసింది, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది టిఆర్‌ఎస్‌ పార్టీయేనని గుర్తుంచుకోవాలని రఘునందన్‌రావుకు సూచించారు. ఉద్యమం ఓవైపు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటే, సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో పార్టీని, ఉద్య మాన్ని నిలువునా చీల్చేందుకు సీమాంద్రులు ఆడుతున్న ఆటలకు బలి అవుతున్నాడని రఘునందన్‌రావుపై విమర్శలు కురిపించారు. ఆనాడు వైఎస్‌ కూడా ఇలాంటి కుట్రలకే పాల్పడి ఇరవై ఆరుమంది ఎమ్మెల్యేల్లో చిచ్చుపెట్టినా తర్వాత కాలగర్బంలో వైఎస్‌ పెట్టిన చిచ్చే కలిసిపోయిందన్నారు. ఆతర్వాత సీమాంద్రకు చెందిన జగన్‌బాబు, చంద్రబాబు, కిరణ్‌బాబులు కూడా అదే విషంతో తెలంగాణా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఎంతో మంది శిఖండులను టిఆర్‌ఎస్‌పైన, ఉద్యమంపైన ప్రయోగించి చివరకు తోక ముడుచుకున్నారని ఆరోపించారు. ఆంధ్రానాయకుల కుట్ర, అహంకార పూరిత ధోరణి వల్లే నేడు రఘునందన్‌రావు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. నిజంగానే ఆదారాలుంటే తక్షణమే బయటపెట్టాలని ఈటెల డిమాండ్‌ చేశారు. దమ్ము ధైర్యం ఉంటే ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణా ఉద్యమాన్ని గొంతు కోయవద్దన్నారు. తెలంగాణా ఉద్యమం రోజురోజుకు బలపడిపోతుందని చెప్పడానికి చిన్నపాటి మండలమైన జూలపల్లిలో వేలాది మంది మహిళలు, గ్రామస్థులు కేసిఆర్‌ సభకు తరలివచ్చి హారతులతో స్వాగతం పలికారన్నారు. పైసలు వెదజల్లి విూడియాను కృత్రిమంగా మేనేజ్‌ చేసినా, చిలుకపలుకులు చెప్పించినా సీమాంధ్రుల ఎత్తుగడలు ఎక్కువ కాలం నిలువలేవన్నారు. రఘునందన్‌రావు వెనుకాల తెలంగాణాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పిన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హస్తం ఉందని ఈటెల ఆరోపించారు. ఇప్పటికైనా ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసిఆర్‌పైన, ఉద్యమంపైన అనవసర ప్రేలాపనలు చేస్తే భస్మీపటలం కాక తప్పదన్నారు. తెలంగాణా కోసం అసువులు బాసిన యువకుల దుఃఖం ఎందుకు కనిపించడం లేదో ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని రఘునందన్‌రావుకు ఈటెల హితవు పలికారు. గతంలో సస్పెండ్‌ చేసిన వారంతా రఘునందన్‌రావులానే మాట్లాడారని తెలిపారు. రఘునందన్‌రావు నైజం గురించి తెలుసుకోవాలనుకుంటే పటాన్‌చెరువుకు వెల్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఏ వ్యక్తికైనా పార్టీ బలం, నైతికతను, టిక్కెట్‌ మాత్రమే ఇస్తుందని, డబ్బులు ఇవ్వదని పేర్కొన్నారు. పదమూడు సంవత్సరాలు ఉద్యమంలో అనేక పదవులు అనుభవించిన వ్యక్తి ఇలా రోడ్డుపైకెక్కి ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం నైతికత అనిపించుకోదన్నారు. రఘునందన్‌ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే సీమాంద్రుల జాతి,నీతి, అహంకారం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్నారు. తెలంగాణా రాష్టాన్న్రి ఏర్పాటు కాకుండా చూడడం సీమాంద్రుల కుహన సంస్కారమే నేటి రఘునందన్‌రావు ఆరోపణలు, వ్యాఖ్యలన్నారు. ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా హరీష్‌రావు చెప్పినట్లుగా ఎక్కడైనా ఫిర్యాదు చేసుకుని ఆధారాలను  సమర్పించాలని సవాల్‌ విసిరారు.