ఒలంపిక్‌ డబుల్స్‌లో ఫెదరర్‌ ఔట్‌

– సింగిల్స్‌లో ముందంజవేసిన స్విస్‌ స్టార్‌
లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో రెండు మెడల్స్‌ గెలుచుకోవాలనుకున్న స్విస్‌ థండర్‌ రోజర్‌ ఫెదరర్‌ కల చెదిరింది. పురుషుల డబుల్స్‌ ఈవెంట్‌ రెండో రౌండ్‌లోనే ఫెడెక్స్‌ పరాజయం పాలయ్యాడు. సహచరుడు స్టావ్లిస్‌ వావ్‌రింకాతో జత కట్టిన ఫెదరర్‌ రెండో రౌండ్‌లో ఇజ్రాయిల్‌కు చెందిన జొనాథన్‌ ఎర్లచ్‌, అండీ రామ్‌ చేతిలో ఓడిపోయాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఫెడెక్స్‌ పెయిర్‌ 6-1, 6-7, 3-6 తేడాతో ఓటమి చవిచూశారు. తోలి సెట్‌లో తేలిగ్గా తలవంచిన ఇజ్రాయిల్‌ జోడీ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. రెండో సెట్‌లో మ్యాచ్‌ పాంయింట్‌ను కాచుకుని మరీ ఆధిక్యం నిలుపుకుంది. కీలకమైన మూడో సెట్‌లో కూడా చక్కగా ఆడిన ఆ జోడి ఫెదరర్‌ పెయిర్‌పై విజయం సిధించింది. ఈ విజయంతో డబుల్స్‌ విభాగంలో స్విస్‌ ష్టార్‌ పోరు ముగిసింది. అయితే సింగిల్స్‌లో మాత్రం ఫెదరర్‌ జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్‌లో అతను 7-5, 6-3 తేడాతో ఉజ్బెకిస్తాన్‌ ప్లేయర్‌ ఇస్టోమిస్‌పై విజయం సాదించాడు. అలాగే సెర్బియా స్టార్‌ నోవక్‌ జొకోవిచ్‌ మూడో రౌండ్‌లో చెమటోడ్చాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా ఆటగాడు లీటన్‌ హెవిట్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌ మొదటి సెట్‌ను కోల్పోయాడు. అయితే తర్వాత పుంజుకొని 4-6, 7-5, 6-1 తేడాతో విజయం సాధించాడు.