ఒలింపిక్స్లో సైక్లిస్ట్ మృతి

i2rq8kvg-copyరియో డీ జనీరో: రియోలో జరుగుతున్న పారాలింపిక్స్లో శనివారం అపశ్రుతి చోటు చేసుకుంది. ఇరాన్కు చెందిన సైక్లిస్ట్ సర్ఫరాజ్ బహ్మాన్(48) గుండె పోటు గురై ప్రాణాలు కోల్పోయాడు. మౌంటైన్ స్ట్రెచ్లో భాగంగా సీ4-5 ఈవెంట్లో పాల్గొన్న సమయంలో సర్ఫరాజ్  ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని స్థానిక అథ్లెట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే డాక్టర్లు చేసిన కృషి ఫలించకపోవడంతో అతను అసువులు బాసాడు. ఈ ఘటనపై అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ(ఐపీసీ) విచారం  వ్యక్తం చేసింది.

ఆ సైక్లిస్ట్ గుండె పోటుకు గురికావడంతో హుటాహుటీనా బర్రాలోని రియో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించే యత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆస్పత్రికి తీసుకెళ్లిన కాసేపటికే సర్ఫరాజ్ మృతి చెందినట్లు ఒలింపిక్ కమిటీ ధృవీకరించింది. బుధవారం తొలి రేస్ లో పాల్గొన్న సర్ఫరాజ్ కు ఇది రెండో రేస్  కాగా, పారా ఒలింపిక్స్ 56 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఇలా పోటీలో పాల్గొన్న అథ్లెట్ మృతి చెందడం ఇదే తొలిసారి.

1980లో జరిగిన ఓ యుద్ధంలో సర్పరాజ్ ఒక కాలును కోల్పోయాడు. అనంతరం 2002లో సైక్లింగ్ గేమ్ను ఎంచుకున్న అతను సత్తాచాటుకున్నాడు. రియోకు ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన అతను దుర్మరణం చెందడం పట్ల స్నేహితుడు హషీమ్ సంతాపం వ్యక్తం చేశాడు. ఎప్పుడు సంతోషంగా ఉండే సర్ఫరాజ్ ఇలా తమను వదిలి వెళ్లిపోవడం  అత్యంత బాధాకరమంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.