ఓటమికి అందరూ బాధ్యులే : ఎంపీ ప్రభాకర్
హైదరాబాద్ :ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి పార్టీ నేతలంతా బాధ్యతవహించాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలకుగాను 16 నియోజకవర్గాలతోపాటు ఒక పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులపై విశ్లేషణ జరగాలని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ఏకైక స్థానం పరకాల ఫలితంపై ప్రత్యేక చర్చ, లోతైన విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నష్ట నివారణ చర్యలు చేపట్టకుంటే పార్టీ మనుగడ కష్టమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లోనే కాకుండా బయటా తెలంగాణ వాణి వినిపిస్తున్న నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథంపై పార్టీలోని ఓ వర్గం దాడికి పూనుకోవడం దారుణమంటూ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారందరినీ అరెస్టు చేస్తున్న సీబీఐ లగడపాటి రాజగోపాల్ తమ్ముడిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించకుండా ఉండాలంటే లగడపాటి తమ్ముడిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.