ఓటమి భయంతోనే టిఆర్‌ఎస్ అడ్డదారులు
కెసిఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు
సిద్దిపేట ఘటనపై మండిపడ్డ బండి సంజయ్
కరీంనగర్‌లో బండికి మద్దతుగా ఆందోళన
కరీంనగర్,అక్టోబర్27(జనంసాక్షి): దుబ్బాక ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలంగాణ ప్రభుత్వం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ రాచరిక, నియంతృత్వ పాలన కొనసాగిస్తు న్నారని, ఇందుకు సిద్దిపేట సంఘటనే నిదర్శనమన్నారు. ఫాంహౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం లాగానే మంత్రులు సైతం బరితెగించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచేందుకు కార్యకర్త కారులో డబ్బుపెట్టి రికవరీ అంటూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని, సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులు మహిళలు, చిన్నపిల్లల పట్ల సంస్కారహీనంగా వ్యవహరించారని ఆరోపించారు. దుబ్బాక ఎన్నికలకు సిద్దిపేటకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సిద్దిపేటకు వెళ్తున్న తన కారును అడ్డగించి అరెస్ట్ చేసే సమయంలో గొంతు పట్టి కారులో పడేశారని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటే.. ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తోందని పేర్కొన్నారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ఉందో లేదో కూడా తెలియడం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధం గా ఎన్నికలు నిర్వహించకుంటే ఫాంహౌస్, ప్రగతిభవన్‌పై సైతం దాడి చేస్తామని హెచ్చరించారు. సీపీని సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో ఎంపీ కార్యాలయంలోనే సంజయ్ నిరాహారదీక్షకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన సోమవారం రాత్రి దీక్ష చేపట్టారు. ఎంపీ కార్యాలయంలోనే దీక్షకు ఉపక్రమించిన సంజయ్, రాత్రి నేలపై పడుకొని తన నిరసనను తెలిపారు. సంజయ్ దీక్షకు సంఘీభావంగా బయట కార్యకర్తలు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. పోలీసుల వ్యవహార శైలి గురించి బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను సిద్దిపేటకు వెళ్తే, సీపీ జోయల్ డేవిస్ తనపై దాడి చేసి అక్రమంగా కరీంనగర్‌కు తరలించారని ఆరోపించారు. సీపీని వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దుబ్బాకలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే, బీజేపీ గెలుపు తథ్యమని భావించిన అధికార టీఆర్‌ఎస్ పార్టీ, అధికారులను ఉసిగొలిపి అరాచకాలకు పాల్పడుతుందని విమర్శించారు. ఇక రెచ్చగొట్టే చర్యలకు దిగినా, కార్యకర్తలు సమన్వయం పాటించి దుబ్బాక నియోజకవర్గంలోని బూత్ లెవల్ కార్యకర్తలు యథావిధిగా ప్రచారం కొనసాగించాలని సంజయ్ కోరారు. సిద్దిపేట సంఘటనపై ఎన్నికల సంఘం స్పందించాలని, కేంద్ర బలగాలను పంపించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.