ఓటర్ల జాబితా పరిశీలన ప్రారంభం
విజయనగరం, జూలై 11 : జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఇంటింటికి వెళ్లి పరిశీలించే కార్యక్రమం బుధవారం నుండి ప్రారంభమైంది. ఈ నెలఖరు వరకు చేపట్టే ఈ కార్యక్రమానికి ప్రజలు, రాజకీయ పక్షాలు సహకరించి తప్పులు లేని జాబితాను రూపొందించేందుకు తోడ్పడాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య కోరారు. ఆయన నివాస గృహం నుంచి ప్రారంభమైన ఈ పరిశీలనలో భాగంగా సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సిబ్బంది ఇంటింటి పరిశీలన సందర్భంగా ఇంటి వద్ద అందుబాటులో లేని వారు సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్లి జాబితాలో తమ కుటుంబ సభ్యుల పేరు, మార్పులు, చేర్పులకు సంబంధించిన సమాచారం అందించవచ్చునన్నారు. బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన, మరణించిన ఓటర్లకు సంబంధించి తమకు తెలిసిన సమాచారాన్ని ఇళ్లకు వచ్చే బూత్‌స్థాయి అధికారులకు తెలియజేయాలని విజ్ఞాప్తి చేశారు. ఈ ఏడాది జనవరి 1కి 18 ఏళ్ల నిండిన యువతీ యువకులంతా ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకునేందుకు అర్హులని, వారంతా బూత్ స్థాయి అధికారుల నుంచి దరఖాస్తు తీసుకొని దరఖాస్తు చేయాలన్నారు. విజయనగరం తహశీల్దార్ లక్ష్మారెడ్డి తన సిబ్బందితో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఓటర్ల పరిశీలన కార్యక్రమం చేపట్టారు.