ఓడితే రాజకీయ సన్యాసం: మంత్రి తలసాని

హైదరాబాద్‌, మార్చి 20: ‘తిరిగి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా.. ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అన్ని పార్టీలపై ఆయన నిప్పులు చెరిగారు. నిరుద్యోగ సమస్యకు కాంగ్రెస్సే కారణమని, అలాంటిది ఆ పార్టీ నిరుద్యోగంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ భయపడిందని, కాబట్టే ఒక్క సీటులోనైనా అభ్యర్థిని నిలపలేదని చెప్పారు. ఆ పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డిది మురికినోరని, ఆయన జోలికి వెళ్లనన్నారు. తెలంగాణకు రావాల్సిన నీరు, విద్యుత్‌పై బిజెపి నేతలు ఎందుకు నోరు మెదపట్లేదని తలసాని ప్రశ్నించారు.