ఓయూలో ‘పరీక్ష’.. మళ్లీ ఉద్రిక్తత

wuie71zuహైదరాబాద్ : ఓయూలో బీఫ్ ఫెస్టివల్ అనంతరం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పీజీ సెమిస్టర్ పరీక్షల విషయంపై సందిగ్ధత నెలకొంది. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు..పరీక్ష యథాతథంగా కొనసాగుతుందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. దీనితో ఓయూలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నెలరోజుల గ్యాప్‌తో అకాడమిక్ ఇయర్‌ను ప్రారంభించారని , ఒక వారం రోజులు వాయిదా వేయాలని కోరిన తమపై పోలీసులను ఉసిగొల్పుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. నాలుగు రోజుల క్రితమే తమకు ప్రాక్టికల్స్ పూర్తయ్యాయని.. ఇంతలోనే పరీక్షలు నిర్వహిస్తే ప్రిపరేషన్‌ లేకుండా తాము ఎలా రాయగలమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్ విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని వెంటనే పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ గ్రూప్ కు చెందిన కొంతమంది పరీక్షకు హాజరవుతుండగా సైన్స్ గ్రూప్ కు చెందిన కొంతమంది పరీక్ష రాయడానికి నిరాకరిస్తున్నారు.

బందోబస్తు – ఏసీపీ…
శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు తాము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఏసీపీ లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రాక్టికల్స్..ఎగ్జామ్ పరీక్షకు ఇబ్బందికరంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు తాము ముందస్తు అరెస్టులు చేయడం జరిగిందన్నారు.