ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌కు హైకోర్టు బ్రేక్‌

1

– కఠిన చర్యలు తీసుకోండి

– పోలీసులకు ఆదేశం

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి): బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులకు హైకోర్టులోనూ చుక్కెదురు అయింది. ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు కోర్టు  అనుమతి నిరాకరించింది. సిటీ సివిల్‌ కోర్టు ఉత్తర్వులను అమలు పరచాల్సిందేనంటూ బుధవారం ఆదేశించింది. ఓయూలో కొన్ని విద్యార్థి సంఘాలు ఈనెల 10న తలపెట్టిన బీఫ్‌ ఫెస్టివల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. దీనిని  నిర్వహించరాదంటూ సిటీ సివిల్‌ కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థులు స్వార్థపరుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారొద్దని సూచించింది. సిటీ సివిల్‌ కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించరని ఆశిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. గతేడాది బీఫ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించింది. దీంతో ఇక్కడ ఇంతకాలంగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది.  కాగా ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌ జరపవద్దంటూ కడెం రాజు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించరాదని స్పష్టం చేసింది. పోలీసులు శాంతిభద్రతలు కాపాడాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 20వ తేదీ వరకు వర్సిటీలో ఎలాంటి ఫెస్టివల్స్‌ నిర్వహించ కూడదని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని సిటీ సివిల్‌ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న బీఫ్‌ ఫెస్టివల్‌ని నిర్వహించేందుకు ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్‌) సన్నాహాలు చేస్తోంది. అయితే  ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెస్టివల్‌ నిర్వహణను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్‌ పెస్టివల్‌ జరపరాదని  ఆదేశాలు ఇచ్చింది. సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని హైకోర్టు అబిప్రాయపడింది. ఉస్మానియాలో బీఫ్‌ ఫెస్టివల్‌ కు అనుమతి లేదని, అక్కడ శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత పోలీసులపై ఉందని కూడా హైకోర్టు తెలిపింది. గత కొద్ది రోజులుగా ఉస్మానియాలో బీఫ్‌ పెస్టివల్‌ విషయంపై ఉద్రిక్తత ఏర్పడింది. ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కొన్ని విద్యార్ది సంఘాలు పట్టుబడుతున్నాయి. అదే సమయంలో హిందూ అనుకూల సంస్థలు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే రాజా సింగ్‌ వంటివారు వీటిని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేఫధ్యంలో హైకోర్టు బీఫ్‌ ఫెస్టివల్‌ కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం విశేషం. దీంతో ఇప్పటికే మొహరించిన పోలీసులు భద్రతను పెంచారు. ఎలాంటి ఆందోళనలు జరక్కుండా చర్యలు తీసుకున్నారు.