ఓయూ జేఏసీ నేతల విస్తృత సమావేశం
సెప్టెంబర్ 27న తెలంగాణ కోసం
సచివాలయం ముట్టడించాలని పిలుపు
హైదరాబాద్,జూలై 28 (జనంసాక్షి) :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తాడో పేడో తేల్చుకోవడానికి ఓయూ జేఏసీ నాయకులు సిద్దమవుతున్నారు. గత కొంత కాలంగా స్దబ్దుగా ఉన్న ఓయూ జేఏసీ, విద్యార్థి నాయకులు మరోసారి ఉధృతం చేయాలని విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించింది. క్రియాశీలంగా ఉద్యమాలు జరిపేందుకు తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించింది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి నాయకులు కూడా ఈ నెల సెప్టెంబర్ 27న లక్షలాది విద్యార్థులతో తెలంగాణ విద్యార్థి ఉద్యమ కవాతు పేరుతో సెక్రటేరియట్‌ను ముట్టడిం చనున్నట్లు ప్రకటించారు. అనంతరం తెలంగాణను తామే ప్రకటించుకుంటామని పేర్కొన్నారు. తమ భవిష్యత్తు కార్యాచరణను ఓయూ విద్యార్థి నాయకులు ఆగస్టు రెండో వారంలో గో టు కాలేజ్..సెప్టెంబర్ 1 నుండి 17 వరకూ గ్రామగ్రామాన విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాద యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ నాయకులు తెలంగాణపై అడ్డగోలు ప్రకటనలు చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 ఎఫ్ రద్దు కాలేదనీ, తెలంగాణపై డిసెంబర్9 ప్రకటన తెలంగాణ రాజకీయ నాయకుల ఉద్యమాలతో వచ్చింది కాదనీ, అది విద్యార్థులు తీవ్రంగా పోరాడి సాధించుకున్నారనీ స్పష్టం చేశారు. ఇపుడు కూడా సెప్టెంబర్ 27న జరిగే సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేస్తామనీ, తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటామని తేల్చిచెప్పారు.