ఓరుగల్లుకు పూర్వవైభవం

– రెండో రాజధానిగా వడివడిగా అడుగులు
– సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్దతో వేగంగా అభివృద్ధి పనులు
– టెక్స్‌టైల్‌ పార్క్‌తో వలసలకు చెక్‌
– రింగ్‌రోడ్డుతో మారబోతున్న ఓరుగల్లు ముఖచిత్రం
– పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
– హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్న ఓరుగల్లు ప్రజానీకం
వరంగల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఓరుగల్లు .. ఈ పేరు చెప్పగానే.. కాకతీయ రాజుల ప్రాభవం కళ్లుముందే కదలాడుతోంది.. దశాబ్దాల క్రితం కాకతీయ రాజులు ఓరుగల్లును కేంద్రంగా చేసుకొని పాలన సాగించారు.. ఆ సమయంలో ఓరుగల్లు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.. ఇప్పటికీ వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో కాకతీయ రాజుల పాలనను గుర్తుకు తెచ్చేలా ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తుంటాయి.. కాగా రానురాను ఓరుగల్లు ప్రాభవం తగ్గుతూ వచ్చింది.. పాలకుల విధానాలతో కేవలం హైదరాబాద్‌ కేంద్రంగానే అభివృద్ధి కేంద్రీకృతమైంది.. ఉమ్మడిరాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా కొనసాగిన  నేతలు అడపాదడపా అభివృద్ధి పనులు చేపట్టినా కాకతీయుల పాలనను గుర్తుకు తెచ్చేలా అవి జరగకపోవటం ఓరుగల్లు వాసులను నిరాశకు గురిచేస్తూ వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావటం తదనంతరం కేసీఆర్‌ అధికారంలో రావటంతో హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను తీర్చిదిద్దేందుకు అడుగులు పడ్డాయి.. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాను ఐదు జిల్లాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్‌ కేంద్రాలుగా ఐదు జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వం అందించే పథకాలను క్షేత్రస్థాయిలోని పేదలకు లబ్ధిచేకూరటంతో పాటు గత ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్నిప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక
దృష్టి కేంద్రీకరించింది.
టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా గుర్తింపు..
కాకతీయ రాజుల ప్రాభవాన్ని గుర్తుకు తెచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించటంతో పాటు ఆ మేరకు వేగంగా అడుగులు వేస్తుంది. దీంతో వరంగల్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు కల్పించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అనుకుందే తడవుగా చకచకా ఏర్పాట్లు జరగడంతో ఆదివారం వరంగల్‌ రూరల్‌ జిల్లాలో టెక్స్‌ టైల్‌ పార్క్‌కు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ టెక్స్‌టైల్‌ పార్కుతో తొలి రోజే రూ.3,900 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదరడం, వీటి వల్ల ప్రత్యక్షంగా 27వేలు, పరోక్షంగా 50వేల ఉద్యోగాలకు అవకాశం ఏర్పడనుండటంతో జిల్లా ప్రజలు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు. రకరకాల వస్త్రాలు, డిజైనింగ్‌, ఫ్యాషన్‌ దుస్తులు ఒకే చోట తయారయ్యేలా, సూరత్‌, బీవండి, తిర్పూర్‌, షోలాపూర్‌ ప్రాంతాల కలయికతో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును ప్రభుత్వం రూపొందించనుంది. ఈ టెక్స్‌ టైల్‌ పార్కుతో స్థానికంగా ఉన్న పత్తి రైతులతో పాటు, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తద్వారా దేశానికే ఆదర్శంగా ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ రూపొందబోతోంది.. దీంతో పొట్టకూటికోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని మళ్లీ తిరిగి రప్పించి స్థానికంగానే ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రింగ్‌రోడ్‌తో మారుతున్న వరంగల్‌ ముఖచిత్రం..
వరంగల్‌ చుట్టూరా రూ. 669.59 కోట్లతో నిర్మించే వరంగల్‌ ఔటర్‌ రింగ్‌రోడ్‌కు సీఎం కేసీఆర్‌ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఓరుగల్లు చుట్టూ 69 కి.విూతో ఈ ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. 32 కల్వర్టులు, 12 వంతెనలతో నిర్మాణం జరిగే ఈ ఓఆర్‌ఆర్‌ నిర్మాణం నగరానికికే ఆకర్షణగా నిలవనుంది. ఈ రింగ్‌రోడ్డుతో వరంగల్‌ ముఖచిత్రం మారటం ఖాయమని స్థానిక ప్రజలు
ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  వరంగల్‌ స్వరూపాన్ని మార్చే ఔటర్‌రింగ్‌రోడ్‌తో జాతీయ రహదారుల విస్తరణతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వేసే రోడ్డు మార్గాల ద్వారా రహదారులే జీవనాడులుగా విరాజిల్లుతాయని హర్షాతిరేఖాలు వ్యక్తం ఏస్తున్నారు. హైదరాబాద్‌ టు వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌లో అనేక సంస్థలకు ఈ ఓఆర్‌ఆర్‌తో ఓరుగల్లు నవనిర్మాణం జరుగనుంది. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తూ వస్తున్న వరంగల్‌ ప్రజల కల ఆర్‌ఓబీ నిర్మాణంతో త్వరలోనే సాకారం కాబోతోంది.
కేసీఆర్‌ సభకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు..
ఆదివారం వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కేసీఆర్‌ బహిరంగ సభకు ఓరుగల్లు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే హైదరాబాద్‌కు ధీటుగా ఓరుగల్లును రెండవ రాజదానికిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్న సమయంలో ప్రజలు హర్షద్వానాల మధ్య కేసీఆర్‌ మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డు, మడికొండ ఇంక్యూబేషన్‌ సెంటర్‌, కాజీపేటలో మరో ఆర్వోబీకి ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతున్నంత సేపు ప్రజలు నూతనోత్సాహంతో కేరింతలు కొట్టారు. కేసీఆర్‌ అకుంటిత దీక్షతో తెలంగాణ సాకారం కావటంతో పాటు, వరంగల్‌ ఉమ్మడి జిల్లా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, తద్వారా మా బతుకులు మారతాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్‌ రాష్ట్రంలోనే పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని, ఇలాంటి పాలన కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని,
ఇప్పుడు మా కల ఒక్కొక్కటిగా కేసీఆర్‌ తీరుతో సాకారం అవుతుందని స్థానిక ప్రజలు ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇదిలా ఉంటే రాబోయే కాలంలో ఏ పెద్ద పరిశ్రమ వచ్చినా ముందు వరంగల్‌కే ఇస్తానని కేసీఆర్‌ పేర్కొనడంతో ఇక మాకు వలసలు పోవాల్సిన పనిలేదని, వలసలు పోయినోళ్లు తిరిగి వచ్చి మా ప్రాంతంలోనే మేము సంతోషంగా జీవనం సాగించే అవకాశం రాబోతుందని పేర్కొంటున్నారు. మొత్తానికి  కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితో కాకతీయు రాజుల పాలన మళ్లీ తెరపైకి రాబోతుందనటంలో అతిశయోక్తి లేదు.