ఓరుగల్లు టిడిపిలో ఇక రేవూరి ఒంటరి పోరు
వరంగల్,నవంబర్1(జనంసాక్షి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక టిడిపి ఖాళీ అయినట్లే. ఏకైక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్‌ఎస్‌లో చేరగా, రేవంత్‌తో పాటు అనేకమంది కాంగ్రెస్‌లో చేరడంతో ఇక మిగిలింది పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి మాత్రమే. అంతకు ముందే ఎమ్మెల్యే బోడకుంటి వెంకటేశ్వర్లు తదితరులు టిడిపిని వీడారు. ఇప్పటికే కార్యకర్తలంతా టిఆర్‌ఎస్‌లో చేరారు. టిడిపి కూడా ఇక దాదాపు ఖాళీ అయినట్లే భావించాలి. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క, పరకాలకు చెందిన తెరాస నేత దొమ్మాటి సాంబయ్యలు దిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరి చేరికతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ సవిూకరణాలు మారనున్నాయి. అలాగే టిడిపి ముఖ్య నాయకులు, వివిధ గ్రామ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు వీరివెంట నడవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
సీతక్క రాజీనామా చేయడంతో ములుగు నియోజకవర్గంలో తెదేపా ఖాళీ అయినట్లే. పార్టీలో వ్యతిరేక వర్గమనేది లేకుండా శ్రేణులంతా సీతక్క నాయకత్వంలోనే పని చేస్తున్నారు. దీనివల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వమనేది ఇంత వరకు లేదు. తేదేపాలో 13 ఏళ్ల సీతక్క ప్రస్థానం ముగిసింది. కొంత కాలం దళకమాండర్‌గా పని చేసి లొంగిపోయాక, 2004లో తెదేపా నుంచి టికెట్ పొంది ఎమ్ల్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినా పార్టీని నమ్ముకొని ఉన్నారు. పలు మార్లు ఆమె తెదేపాను రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీగా అభివర్ణించారు. ఇంత కాలం జిల్లాలో సీతక్క, గండ్ర సత్యనారాయణరావు పార్టీని బలంగా నడిపిస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణ రావు గత కొంత కాలంగా రేవంత్‌రెడ్డి వెంటే ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మాత్రం ఇంకా పార్టీని వీడలేదు. త్వరలో తెదేపాను వీడతారని భావిస్తున్నారు. దొమ్మాటి సాంబయ్య సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో తెదేపా నుంచి పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేసి తెరాసకు చెందిన బండారి శారారాణి చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో వరంగల్ ఎంపీ స్థానానికి బీ-ఫాం దక్కించుకున్నారు. చివరి సమయంలో పొత్తుల కారణంగా ఆ స్థానం భాజపాకు వెళ్లింది. సాంబయ్య రెబల్‌గా పోటీ చేశారు. తెదేపా నుంచి బహిష్కరించగా తెరాసలో చేరారు. 2014లో తెదేపాలో చేరి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఏడాదిన్నర కిందట గులాబీ కండువా కప్పుకున్న దొమ్మాటి తెరాసలో సరైన గుర్తింపు లభించక దూరంగా ఉన్నారు. ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ సూచన మేరకు గత నెలలో భూపాలపల్లిలో జరిగిన సింగరేణి ఎన్నికల్లో తెరాస తరఫున ప్రచారం నిర్వహించారు. చివరికి రేవంత్‌రెడ్డి వెంట కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఇప్పుడున్న గ్రామకమిటీలు కూడా టిఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్‌లో చేరనున్నాయని సమాచారం. అయితే ఏకాకిగా మిగిలిన రేవూరి ప్రకాశ్ రెడ్డి టిడిపిలోనే కొనసాగుతారా అన్నది చూడాలి. ఆయన మాత్రమే పార్టీని నెట్టుకుని రావడం కష్టమనపే భావించాలి. రాజకీయ ఆకాంక్షలు ఉన్న టిడిపి నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో టిఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల వైపు మొగ్గు చూపడం ఖాయం.