ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె రాసిన ‘విముక్త’ కథా సంకలనాన్ని 2015 సంవత్సరానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సాహిత్య అకాడమీ తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 23 భాషల్లో వచ్చిన రచనలను జ్యూరీ సభ్యులు సమీక్షించి అవార్డులకు ఎంపిక చేయగా అకాడమీ ఛైర్మన్ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కార్యనిర్వాహకవర్గం విజేతల జాబితాను విడుదల చేసింది. బెంగాలీ భాషలో మాత్రం అవార్డును త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సెలర్ ఆవుల మంజులత, జీ యోహాను బాబు, సీనియర్ పాత్రికేయుడు కే రామచంద్రమూర్తితో కూడిన తెలుగు జ్యూరీ ఓల్గా కథా సంకలనాన్ని అవార్డుకు ఎంపిక చేసింది. వివిధభాషలకు చెందిన మొత్తం 23 అవార్డుల్లో ఆరు కథల సంకలనాలకు, ఆరు కవిత్వానికి, నాలుగు నవలలకు, రెండు వ్యాసరచనలకు, మరో రెండు విమర్శనాత్మక వ్యాసాలకు లభించాయి. ఫిబ్రవరి 16వ తేదీన ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరనుంది.