ఓవరాల్‌ చాంప్‌ రైల్వేస్‌

హైదరాబాద్‌, మార్చి 17 (జనంసాక్షి) :

జాతీయ సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్‌ బాక్సర్లు దూసుకెళ్లారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో రైల్వేస్‌ జట్టు మొత్తం 43 పాయింట్లతో ప్రథమస్థానంలో నిలిచి ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. సర్వీసెస్‌ బాక్సింగ్‌ జట్టుకు రెండో స్థానం, పంజాబ్‌కు మూడోస్థానం దక్కింది. ఇక లైట్‌ ఫ్లై వెయిట్‌ ఫైనల్లో సర్వీసెస్‌కు చెందిన నానోసింగ్‌ 18-15తో అమన్‌దీప్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. బాంటమ్‌ వెయిట్‌లో ఫైనల్‌ చేరి ఆశలు రేకెత్తించిన ఏపీ బాక్సర్‌, కార్ణటక తరఫున ఆడుతున్న దుర్గారావు 9-15తో సంతోష్‌సింగ్‌ (మణిపూర్‌) చేతిలో ఓడి రజత పతకం అందుకున్నాడు. ఇక నానోసింగ్‌, దుర్గారావు టోర్నీ ‘ఉత్తమ బాక్సర్‌’ అవార్డులను గెలుచుకోగా.. ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ కె. సాగర్‌ వర్ధమాన బాక్సర్‌గా అవార్డు తీసుకున్నాడు.