ఔటర్ ప్రాంతాల్లో రైతులు భూములు అమ్ముకోవద్దు… విద్యా, మహిళాభివృద్ధికి ప్రభుత్వం కృషి ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి
హైదరాబాద్, డిసెంబర్ 3: వికలాంగుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వీరి అభివృద్ధి కోసం రూ.5కోట్లను కేటాయించామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో సోమవారంనాడు నిర్వహించిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఆయన ఇబ్రహీంపట్టణంలో జరిగిన సభలో మాట్లాడారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆయన వికలాంగ బాల, బాలికలతో ముచ్చటించారు. ఈ రోజు వీరితో మాట్లాడటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. సమాజంలో వికలాంగులను గౌరవించడం ప్రతి పౌరుని బాధ్యతా అని అన్నారు. ఆర్టీసి బస్సులో నాలుగు సీట్లు రిజర్వేషన్‌పెంచనున్నట్టు చెప్పారు. 40శాతం తక్కువగా అంగవైకల్యం ఉన్న వారికి కూడా పెన్షన్‌సదుపాయం కల్పిస్తామన్నారు. దాదాపు లక్షమందికి లబ్ది చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన కాలేజీ రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. నిజాం కాలేజీ విద్యాభ్యాసం రోజుల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేసానని చెప్పారు. ఆ సమయంలో అంధుల హాస్టల్‌కు వెళ్ళినప్పుడు ఎదురైన అనుభవాన్ని ఆయన గుర్తుచేశారు. అక్కడి హాస్టల్‌కు చెక్కమెట్లు ఉండేవని, వాటిలో కూడా ఒకటిరెండు ఖాళీలుండేవని అన్నారు. అక్కడి అంధ విద్యార్థులంతా చకచకా ముందుకు పోతున్నా తాముమాత్రం వెళ్ళలేక వెనకబడిపోయామన్నారు. అంధులు వాళ్ళా.. మేమా? అని అప్పుడు అనిపించిందన్నారు. జీవితంలో వీరికి ఏదైనా చేయాలని అప్పుడు ఆలోచించానని చెప్పారు. అప్పటి మిత్రులు ఇప్పటికీ తనను కలుస్తుంటారని చెప్పారు. ఆ తొమ్మిదిమంది ఓట్ల మెజారిటీతోనే తాను గెలిచానని భావించానన్నారు. అందుకే వికలాంగుల సంక్షేమం పట్ల ఆసక్తితో కృషి చేస్తున్నానని చెప్పారు. అనంతరం కీసరలో జరిగిన సభలో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌పార్టీదేనన్నారు. మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ఎంతో కృషి సలుపుతోందన్నారు. మహిళా అభ్యుదయానికి తమ పార్టీ పెద్దపీట వేస్తోందన్నారు.
విద్యాభివృద్ధికి తమప్రభుత్వం పాటుపడుతుందన్నారు. రాజీవ్ విద్యా మిషన్ కింద రూ.400కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. చదువు ఒక్కటే శాశ్వతమని… ఆస్తీ డబ్బు ఆశాశ్వితమని అన్నారు. అందుకే పిల్లలు బాగాచదువుకోవాలని ఆకాంక్షించారు. డబ్బు రిజర్వేషన్లతో ఉద్యోగాలు రావని చెప్పారు. విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు దాదాపు రూ.8వేలకోట్ల స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించామని చెప్పారు. రానున్న మూడు నెలలలో లక్షా 25వేల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పారు. రాజీవ్ యువకిరణాల పథకం ద్వారా యువతకు పెద్ద పీట వేస్తామన్నారు. గ్రామీణ ప్రజల అభ్యున్నతే తమ ఆశయమన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుతో రంగారెడ్డి జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. దీనివల్ల భూముల విలువ పెరుగుతుందని అన్నారు. రైతులు స్థిరాస్తులను అమ్ముకోవద్దని, దానిని కాపాడుకోవాలని సూచించారు. భవిష్యత్తులో మరింతగా భూముల ధరలు పెరుగుతాయని చెప్పారు. అందువల్ల ఆస్తులు అమ్ముకోవద్దని అన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై విద్యార్థులు హద్దు మీరొద్దని చెప్పారు. వాహనాల వేగంతో ఎదురయ్యే ప్రమాదాలను గమనించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.