కంటిచూపుతో బాధపడుతున్న చిన్నారిని ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

3

హైదరాబాద్‌ నవంబర్‌ 15 (జనంసాక్షి):

వరంగల్‌ జిల్లా తొర్రూరు కు చెందిన 9వ తరగతి విద్యార్థి గండి రాకేష్‌ కల నెరవేరింది. నోట మాటరాని రాకేష్‌ కు కొద్ది కాలంగా కంటి చూపు కూడా మందగించింది. చాలాకాలంగా రాకేష్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగాలను, పత్రికల్లో వచ్చిన వార్తలను,ఫోటోలను ఫాలో అవుతున్నాడు. వాటన్నింటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటున్నాడు. కేసీఆర్‌ బొమ్మలను కూడా వేస్తున్నాడు. తన కంటి చూపు పూర్తిగా పోయేలోపు కేసీఆర్‌ ను చూడాలన్నది ఆయన కల. ఈ విషయాన్ని తొర్రూరుకు చెందిన స్థానికులు మంత్రి జగదీష్‌ రెడ్డికి చెప్పారు.దీంతో జగదీష్‌ రెడ్డి రాకేష్‌ విషయం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈవాళ రాకేష్‌ ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటికి ఆహ్వానించారు. దీంతో రాకేష్‌ నేడు క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ ను కలిశారు. తాను గీసిన బొమ్మలను బహూకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాకేష్‌ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్యం చేయిస్తామని చెప్పారు. రాకేష్‌ భవిష్యత్‌ కు కావాల్సిన ఏర్పాట్లు కూడా చూస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు.