కంటివెలుగు కోసం భారీగా ఏర్పాట్లు
సిఎం రాకతో కట్టుదిట్టంగా అమలుకు చర్యలు
మెదక్,ఆగస్ట్8(జనం సాక్షి): పేదలకు ఉద్దేశించిన కంటివెలుగు కార్యక్రమం అమలుకు సకల చర్యలు తీసుకున్నామని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఈ నెల 15న కంటి వెలుగు కార్యక్రమాన్ని తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇటీవలే అన్ని శాఖల అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఇదిలావుంటే నాలుగో విడుత హరితహారంలో భాగంగా జిల్లాలో ఇప్పటికే 2.60లక్షల మొక్కలు నాటామన్నారు. సీఎం వచ్చే లోపు మరో లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాలిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఇంటింటినీ సర్వే చేసి ఇంటికి ఎన్ని మొక్కలు పంపిణీ చేయాలో గుర్తించి వారికి మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. తూప్రాన్ నుంచి మల్కాపూర్ వెల్లే మార్గంలో ఇప్పటికే హరితహారంలో మొక్కులు నాటామని మరో 4కిలోవిూటర్ల పొడవునా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు అవకాశంఉన్నట్లు గుర్తించామని ఆ ప్రదేశంలో మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు. జాతీయ రహదారి, వసతి గృహాలు, పాఠశాలలు, డబుల్‌బెడ్‌రూం నిర్మాణ ప్రాంతా ల్లో ఒక లక్షల మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్, ఇక్సైజ్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో 8వేల ఈత మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో రైతుబీమా పథకం ద్వారా 92వేల మంది రైతులు అర్హులని గుర్తించామని వారిలో బీమా నమోదు చేయించుకున్న 72వేల మంది రైతుల కు ఎల్‌ఐసీ ద్వార ఇన్సురెన్స్ బాండ్‌లు జిల్లాకు చేరినట్లు వెల్లడించారు. కార్యక్రమం ఈ నెల 13, 14తేదీల వరకు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మిగిలిన వారికి ఈ నెలలోపు అందజేస్తామన్నారు.