కంటి వెలుగుతో పేదలకు మేలు

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

మెదక్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో వినూత్న తరహాలో పరిపాలన చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆశయమని డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రజలకంటి చూపును భద్రంగా కాపాడేందుకు తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ఎవరూ తలపెట్టని, చేయలేని ప్రజాహిత కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పెట్టింది పేరన్నారు. పట్టణ, గ్రావిూణ ప్రాంతాల్లోని ప్రజలందరి కండ్లు బాగుచేసేలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇటీవలే పదవీ విరమణ చేసిన సర్పంచ్‌లు, స్వచ్ఛంద సంస్థలు బాధ్యతగా మెలగాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నిరకాల పథకాల్లో జిల్లా అగ్రభాగాన నిలుస్తుందని, కంటి వెలుగులో సైతం ప్రథమస్థానంలో నిలిచేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అమలు చేయబోతున్నతెలంగాణ కంటి వెలుగు చరిత్రలో నూతన అధ్యాయమని అన్నారు. 15వ తేదీన ఇఎం కెసిఆర్‌ దీనిని ప్రారంభిస్తారని, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరికీ కంటి చూపు ప్రసాదించేందుకు సీఎం మహత్తర ఆలోచన చేశారన్నారు. చూపులేకపోతే జీవితం అంథకారమనే సత్యాన్ని గ్రహించి ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా తమ ప్రభుత్వం ప్రజలకు ఉచిత కంటి వైద్యాన్ని అందించాలని నిర్ణయించిందన్నారు.