కన్నతండ్రే కాలయముడు
ఖమ్మం, (మార్చి 19): కన్నతండ్రే కాలయముడయ్యాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ముక్కు పచ్చలారని మూడేళ్ళ కొడుకుని అతి కిరాతకంగా గొడ్డలితో నరకి చంపాడు. అత్యంత పాశవికమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా చర్ల మండలం చేగడ గ్రామంలో జరిగింది. కొమ్ము వసంతరావు అనే వ్యక్తి మంచంలో నిద్రిస్తున్న మూడేళ్ళ కొడుకు మరియా రక్షక్ ని నిద్రలేపి నిలబెట్టి తన చేతిలో ఉన్న గొడ్డలితో నరికేశాడు. అనంతరం పోలీసులకు లొంగి పోయాడు. రోజు కూలీగా పని చేస్తున్న వసంతరావుకు, భార్య శాంటాతో గొడవలేమీ లేవని, భార్య పైన అనుమానం కూడా లేదని పోలీసులకు చెప్పాడు. కన్నకొడుకుని హత్య చేయడానికి గల కారణాలు మాత్రం చెప్పడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి, వసంతరావుని విచారిస్తున్నారు.