కమలానగర్‌కు కబ్జా ఫీవర్‌..!!

 సర్వే నెం.63-66లో అక్రమాల లోగుట్టు?
– 600 గజాల స్థలానికి ఎసరుపెట్టిన ‘భూ బకాసురులు’
– కాలనీవాసుల ధర్నాతో విషయం వెలుగులోకి..
– దిగొచ్చిన మేయర్‌ జక్క, కమిషనర్‌ రామకృష్ణారావు
మేడిపల్లి – జనంసాక్షి
పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కమలానగర్‌ (సౌత్‌)కు కబ్జా ఫీవర్‌ అంటుకుంది. కాలనీవాసులకు కేటాయించిన స్థలంలో సగానికి సగం స్థలాన్ని కొల్లగొట్టేందుకు కబ్జాకోరులు కన్నేశారు. కోట్ల రూపాయల విలువైన భూమి కావడంతో భూ యజమానితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు తెరతీశారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు తేరుకుని కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించడంతో స్థానికంగా విషయం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
మేడిపల్లి మండలం కమలానగర్‌ సౌత్‌లో 1990-1991 సంవత్సరంలో మేకల బాల్‌రెడ్డి తన భూమిలో లేఅవుట్‌ చేశాడు. సర్వే నెంబర్‌ 4-9, 63-66లో ప్లాట్లు చేయగా.. 150 కుటుంబాలు ఇండ్లను నిర్మించుకున్నాయి. అన్ని పర్మిషన్లు పొంది నిర్మాణాలు చేసుకోగా.. ఆ సమయంలో కాలనీవాసుల అవసరం కోసమని యజమాని బాల్‌రెడ్డి 1280 గజాల స్థలంలో పార్కు, బావి, రోడ్లు తదితర అవసరాల కోసం కేటాయించి మిగతా ప్లాట్లు విక్రయించాడు. ఈ నేపథ్యంలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ పార్కు స్థలాన్ని కాపాడాలని తీర్మానించి, కాంపౌండ్‌ నిర్మించేందుకు మున్సిపల్‌ అధికారులకు విన్నవించారు. అయితే 1280 గజాల స్థలంలో 600 గజాలకు మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రహరీ నిర్మించారు. దీంతో మిగిలిన స్థలానికి రక్షణ లేకుండా పోయింది. ఇదే అదనుగా భావించిన కొందరు స్వార్థపరులు 680 గజాల స్థలాన్ని, వెల్‌ ఏరియా 700 గజాలను ఆక్రమించేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో యజమాని బాల్‌రెడ్డితో ఏకమై లేఅవుట్‌కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు సిద్ధమయ్యారని కాలనీవాసులు వాపోతున్నారు.
వినతులిచ్చినా వినలే…
స్థలాన్ని కనుమరుగు చేసేందుకు కుట్ర చేస్తున్నారని కార్పొరేషన్‌ అదికారులకు, స్థానిక కార్పొరేటర్‌కు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కమలానగర్‌ కాలనీవాసులు మంగళవారం ఆందోళనకు దిగారు. కాలనీ అధ్యక్షుడు కె ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అధికారులు వెంటనే స్పందించి కబ్జాకోరులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. స్థానిక కార్పొరేటర్‌ కె సుభాష్‌నాయక్‌ కాలనీవాసులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఇరువురి మధ్య వాగ్వివాదం తలెత్తింది. ధర్నా విషయం తెలుసుకున్న పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ డాక్టర్‌ రామకృష్ణారావులు స్పందించారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు లేఅవుట్‌ ప్రకారం పార్కు స్థలాన్ని పరిశీలించి ప్రహరీ గోడ కోసం కృషి చేస్తామని హామీనిచ్చారు. కబ్జాకు యత్నిస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. ధర్నాలో కాలనీవాసులు మాజీ కార్యదర్శి డీఎస్‌ నాయక్‌, ప్రధాన కార్యదర్శి ఎల్‌ కృష్ణా కుమార్‌, సంయుక్త కార్యదర్శులు ఎస్‌ నరసింహ, షేక్‌ హసద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.
Attachments area