కమ్యూనిటీ పారామెడికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించకూడదు
వరంగల్ బ్యూరో, జూలై 15 (జనం సాక్షి)
ఆర్ఎంపి పిఎంపీలకు కమ్యూనిటీ పారామెడికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించకూడదని వరంగల్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రాకేష్ వద్దిరాజు అన్నారు. వరంగల్ నగరంలోని ఐఎంఏ హాల్లో శనివారం పలువురు ఐఎంఏ బాధ్యులతోపాటు ప్రముఖ డాక్టర్లతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ ఆర్ఎంపి, పిఎం పి లకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఐఎంఏ మొదటి నుంచి వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రభుత్వం 2015లో తీసుకొచ్చిన జీవో 428 ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆధునిక వైద్యంపై అవగాహన లేని వారికి ప్రజారోగ్యంలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించడం ద్వారా పౌరులకు ఆరోగ్య ప్రమాదాలను సృష్టిస్తుందని వివరించారు. ప్రభుత్వ నిర్ణయం అనైతికమైనదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ లో సిబ్బంది కొరతను అధిగమించడానికి షార్ట్ కట్ మార్గాలను తీసుకోవాలని ప్రయత్నిస్తోంది అన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం అత్యంత ఉత్పాదక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్ధారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్ఎంపి పిఎంపీలు తమ నియంత్రణ రేఖను ఉల్లంఘించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రారంభిస్తుందన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది అర్హత కలిగిన వైద్యులు అందుబాటులోకి వస్తున్నారన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు అర్హత లేని అభ్యాసకులకు శిక్షణ ఇస్తుంది అని ప్రశ్నించారు. గ్రామీణ ఆరోగ్యాన్ని పణంగా పెడుతుందని విమర్శించారు. క్వాలిఫైడ్ వైద్యం అందించడంలో ప్రభుత్వం పని చేయడం లేదని అన్నారు. ఓట్ల కోసం కాదు ప్రజలకు నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరారు. ఇంకా మూఢనమ్మకాల తో వైద్యం చేస్తున్న వారి పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హత లేని వైద్యులు పనిచేయకుండా చూడాలని కోరారు. ప్రతి 10 కిలోమీటర్ల రేడియస్ లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నాణ్యమైన అర్హత కలిగిన వైద్యులను ప్రోత్సహించాలని కోరారు. ఈ సమావేశంలో వరంగల్ ఐఎంఏ బాధ్యులు, వైద్యులు శాంతి కుమార్, నరేష్ కుమార్, అశోక్ రెడ్డి, సంధ్యారాణి, ఆనంద్ బొక్కే, సుమంత్, కరుణాకర్, దిలీప్ కుమార్ లక్ష్మీనారాయణ, బందెల మోహన్ రావు, మన్మోహన్ రాజ్, ఆర్ ఎం ఓ రిషిత్ తదితరులు పాల్గొన్నారు.