కరవుపై దృష్టి పెట్టి ప్రజలను ఆదుకోండి: సిపిఎం

నల్లగొండ,మే4(జ‌నంసాక్షి): తీవ్రకరవు పరిస్థితుల్లో జనం ఇబ్బంది పడుతుంటే, అధికార టిఆర్‌ఎస్‌ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని సిపిఎం  విమర్శించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇతర పార్టీల నాయకులను సంతలో పశువుల్లా కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారే తప్ప పంటలు ఎండిపోయిన రైతులను పరామర్శించడానికి సమయం కేటాయించకపోవడం శోచనీయమని సీపీఎం రాష్ట్ర నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి  అన్నారు.  ప్రజాప్రతినిధులు, నాయకులు ఇతర పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి ఫిరాయించేలా ప్రోత్సహించడంపైనే దృష్టి సారించారని మాజీ ఎమ్మెల్యే  విమర్శించారు. కనీసం పశువులకు తాగు నీటికైనా ప్రయత్నించడం లేదన్నారు. రీడిజైన్‌ పేరుతో ప్రాజెక్టుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.   కరవు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. సీపీఎం రాష్ట్రవ్యాప్తంగా  కరవు యాత్ర చేప్టటి పరిస్థితులను అధ్యయనం చేసిందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కరవుతో అల్లాడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కరవుసహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటి రైతులు పంట నష్టపోయారని, నల్గొండ జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పశువులకు నీటితొట్లు ఏర్పాటు చేయాలని, రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేయాలని, ఎండిపోయిన వరిపొలానికి ఎకరానికి రూ.10 వేలు, పండ్ల తోటలకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే ధర్మారెడ్డిపల్లి ఆకృతిలో మార్పు చేయాలని పదేపదే చెపుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు 2013లో ధర్మారెడ్డిపల్లె కాల్వ నీటిని నార్కట్‌పల్లి మండలం లింగోటం వరకు ఉన్న చెరువులు, కుంటల్లో నింపామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గుర్తుచేసారు. ఇకనైనా జిల్లా కరవును పట్టించుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.