కరీంనగర్‌ బంద్‌ విజయవంతం

హైదరాబాద్‌, జూలై 24 : కరీంనగర్‌ జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. విధులకు వెళుతున్న ఉద్యోగులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అలాగే విద్యా సంస్థలు మూతపడ్డాయి. కొందరు ముందుగానే స్వచ్చందంగా మూసివేయగా.. పనిచేస్తున్న వాటిని ఆందోళనకారులు మూసివేయించారు. అలాగే వాణిజ్య సముదాయాలు తెరుచుకోలేదు. సినిమా థియేటర్లలో ఉదయం ఆటలను రద్దు చేశారు. డిపోల్లోనే బస్సులు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో టిఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, తెలంగాణవాదులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. కొందరు నేతలు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సీమాంధ్ర గూండాలతో వచ్చి తెలంగాణలో హింసాకాండకు కారణమయ్యారని ఆరోపించారు. తెలంగాణపై వైఖరి చెప్పకుండా వచ్చేవారిని ఇలాగే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా సిరిసిల్లలో సోమవారంనాడు వైఎస్‌ విజయమ్మ దీక్ష నేపథ్యంలో తెలంగాణ వాదుల అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధం, లాఠీచార్జిలకు నిరసనగా టిఆర్‌ఎస్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.