కరుణ నాకు తండ్రి లాంటివారు 

– స్టాలిన్‌కు సోనియాగాంధీ భావోద్వేగపు లేఖ
న్యూఢిల్లీ, ఆగస్టు8(జ‌నం సాక్షి) : కలైంజ్ఞర్‌ తనకు తండ్రి లాంటి వారని, ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఆయన మృతికి నివాళులర్పిస్తూ స్టాలిన్‌కు ఆమె భావోద్వేగపు లేఖ రాశారు. కలైంజ్ఞర్‌ మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. నా పట్ల ఆయన చూపించే అభిమానం వెలకట్టలేనిది. దాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆయన నాకు తండ్రి లాంటి వారు. కరుణ వంటి నాయకుడిని మళ్లీ మనం చూడలేము. ఆయన నాయకత్వం లేకపోవడం దేశానికి తీరని లోటు. కరుణానిధి మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లోను ఆయన నాయకత్వ సేవలను ఎనలేనివి. సామాజిక న్యాయం, సమానత్వం, అభివృద్ధి, తమిళుల సంక్షేమం మరీ ముఖ్యంగా నిరుపేదల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. ఆయన ఓ గొప్ప రచయిత. రాజకీయ నేతగానే కాకుండా ఓ రచయితగా కూడా కళా రంగానికి విశేషమైన సేవలు అందించారు’ అంటూ సోనియాగాంధీ లేఖలో పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ కూడా కరుణానిధి మృతికి సంతాపం తెలియజేస్తూ స్టాలిన్‌కు లేఖ రాశారు.