కరోనా భయాల మధ్య మొదలైన విద్యాసంస్థలు

తొలిరోజు భయంభయంగానే హజరైన టీచర్లు,స్టూడెంట్స్‌
భౌతికదూరం, మాస్కుల నిబంధనలు పాటించిన పిల్లలు
విజయవాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థులు,టీచర్లు తొలిరోజు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలకు చేరుకున్నారు. అయితే ఎవరికి వారు మాస్కులు ధరించి, శానిటైజ్‌ చేసుకుని రావడం గమనార్హం. దాదాపుగా రాష్ట్రంలోని
అన్ని పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లుచేశారు. పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థిని ధర్మల్‌ పరీక్ష చేసిన తర్వాత పాఠశాల లోకి అనుమతించారు. అటుపై భౌతిక దూరం పాటిస్తూ ఒక బెంచ్‌పై ఒక విద్యార్థిని చొప్పున కూర్చోబెట్టారు. కరోనాతో అప్రమత్తం ఉండాలని విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు పాఠశాల ప్రారంభోత్సవాలను నిర్వహించి అవగాహన కల్పించారు. ఇలా జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలు సోమవారం పునఃప్రారంభం అయ్యాయి. తొలిరోజు 20 నుంచి 50 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది వైరస్‌
బారిన పడకుండా ఉండేలా విద్యాశాఖ జాగ్రత్తలు చేపట్టింది. తొలిరోజు పిల్లలకు తల్లిదండ్రుల అంగీకార పత్రాలు అందజేశారు. సిబ్బంది, విద్యార్థులు విధిగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టారు. పాఠశాలలు గతంలో నిర్దేశిరచిన సమయాల్లోనే కొనసాగిస్తారు. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పిల్లల సంఖ్యకు అనుగుణంగావసతి లేని పక్షంలో తరగతులు రోజు మార్చి రోజు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. స్కూలుకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు భౌతిక దూరం ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో కూడా కొవిడ్‌ జాగ్రత్తలపై ఒక పీరియడ్‌లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలలో అసెంబ్లీ, క్రీడలు వంటివి పూర్తిగా రద్దు చేశారు. అయితే తొలిరోజు కావడంతో విద్యార్థులు భయంభయంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల పాఠశాల ప్రాంగణంలోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో వ్యాక్సిన వేయించుకోవడానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరవు తున్నారు. విద్యకు పేదరికం అడ్డుకాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పేర్కొన్నారు. పేద విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు ఏమాత్రం భారం కాకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాకానుక వంటి పథకాలను సీఎం వైఎస్‌ జగన ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలోని పేద విద్యార్థుల పాలిట మేనమామగా ముఖ్యమంత్రి నిలిచారన్నారు. నాడు`నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వాటి అనుబంధ వసతి గృహాలను అధునాతన వసతులతో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఒకవైపు కరోనా భయపెడుతున్నా ప్రభుత్వం పాఠశాలలు తెరవాలని ఆదేశాలు జారీ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు
ఒకింత ఆందోళలనలో ఉన్నారు. తమ పిల్లలను బడికి పంపాలా వద్దా అని కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకించినా టీచర్లకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన వేయలేదని, అది పిల్లలపై ప్రభావం చూపుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థర్డ్‌వేవ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో దాని ప్రభావం చిన్నారులపై పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు కొన్ని కొవిడ్‌ నిబంధనలు జారీ చేసింది. పది శాతం కంటే తక్కువ పాజిటివ్‌ రేటు ఉన్న ప్రాంతాల్లో అన్ని పాఠశాలలు తెరవాలి. ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉండకూడదు. 20 మంది కంటే విద్యార్థులు తక్కువ ఉంటే ఒకరోజు అన్ని తరగతులు నిర్వహించాలి. అధికంగా ఉంటే 6, 7 తరగతులు ఒకరోజు, 8, 9, 10 తరగతులు మరుసటి రోజు నిర్వహించాలి. భౌతిక దూరం పాటించాలి. పెన్నులు, ప్లేట్లు, పుస్తకాలు తదితర వస్తువుల మార్పిడి చేయకూడదు. విద్యార్థులు ఇంటికి వెళ్లిన వెంటనే స్నానం చేయించాలని వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. క్రీడలు, స్కూలు అసెంబ్లీ తదితర వంటివి నిర్వహించకూడదు. వీటితో పాటు కరోనా కట్టడికి మరికొన్ని సూచనలు ప్రభుత్వం ప్రకటించింది.