ఆదివాసీ యోధుడు, మావోయిస్టు నేత హిడ్మా ఎన్‌కౌంటర్
` మారేడుమిల్లిలో ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, ఆయన సహచరితో కలిపి ఆరుగురు మావోయిస్టులు మృతి
` ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్రాలోకి ప్రవేశిస్తుంగా ఘటన
` 17 ఏళ్ల వయసులో ఉద్యమంలో కలిసి.. అనతి కాంలోనే కేంద్రకమిటీ సభ్యుడిగా ఎదిగిన వైనం
` ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి
మారేడుమిల్లి(జనంసాక్షి): అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో మోస్ట్‌వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్ ఉన్నారు. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల మృతదేహాలను తీసుకొచ్చిన నేపథ్యంలో మార్చురీ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహించినట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూర్వాటి గ్రామంలో జన్మించిన మద్వి హిడ్మా.. బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. చిన్నవయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుపొందారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు. కాగా మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోనూ ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.
17 ఏళ్ల వయసులో ఉద్యమం వైపు..
వరుస ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులకు తాజాగా మరో గట్టి షాక్ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా అలియాస్ సంతోష్ మృతి చెందాడు. మావోయిస్టు పార్టీలో భీకర గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా మృతి చెందడం.. భద్రతాదళాలకు భారీ విజయనే చెప్పాలి. భద్రతా బలగాలపై కనీసం 26 సాయుధ దాడులకు ఇతడు పథక రచన చేసినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడై 17 సంవత్సరాల వయసులోనే పార్టీలో చేరాడు. మురియా తెగకు చెందిన హిడ్మాకు ఇంగ్లీష్, హిందీ, గోండు, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో పట్టుంది. దండకారణ్యంలో పార్టీశ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరారు. భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో నిష్ణాతుడు. ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మారుపేరైన పీఎల్‌జీఏలో ఒకటో బెటాలియన్‌కు సారథ్యం వహిస్తున్నారు. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్‌గా మారారు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించాడు. సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల వారు అత్యధికంగా ఉంటారు. కానీ, సుక్మా నుంచి ఈ స్థానంలోకి వెళ్లిన తొలి వ్యక్తి ఇతడే. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) నంబర్ 1 బెటాలియన్‌కు హిడ్మా నేతృత్వం వహిస్తున్నాడు. దీనిలోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను వినియోగిస్తారు. ఈ బెటాలియన్‌లో 350 వరకు ఉంటారని సమాచారం. దళాలపై దాడులు చేశాక.. అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను ఈ బెటాలియన్ ఎక్కువగా వాడుతుంటుంది. వీరు పూర్తిగా యూనిఫామ్‌లో ఉంటారని సమాచారం. హిడ్మా నేతృత్వంలో జరిగే దాడుల్లో భద్రతా దళాలకు జరిగే నష్టంతో పోలిస్తే మావోల వైపు 10శాతం కంటే తక్కువ ప్రాణ నష్టం ఉంటుందనే పేరుంది. రెండు దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఇతడి ప్రమేయంతోనే చాలా దాడులు జరిగినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. చింతల్నార్, డోర్నాపాల్, తాడిమెట్ల, మినప.. ఇలా భారీగా ప్రాణనష్టం జరిగిన అనేక ఆపరేషన్లలో హిడ్మా స్వయంగా పాల్గొని 200 మందికి పైగా పోలీసు సిబ్బంది మృతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యాడని సమాచారం. యుద్ధ నైపుణ్య మెలకువల్ని కేడర్‌కు అలవోకగా నూరిపోస్తుంటాడనే పేరుంది. కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే పోలీసు బలగాలపై, సీఆర్పీఎఫ్ శిబిరాలపై మెరుపుదాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. పార్టీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగం ఇతడి కనుసన్నల్లోనే పనిచేస్తుంది.
హిడ్మా జరిపిన దాడుల్లో కొన్ని..
2010లో దంతెవాడలో జరిగిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు 2013లో జైరామ్ ఘాటీలో జరిపిన మెరుపుదాడిలో 27 మంది మరణించారు. వీరిలో పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. 2021లో సుక్మా-బీజాపుర్‌లో జరిగిన మెరుపుదాడిలో 22 మంది భద్రతా సిబ్బంది మృతిచెందారు. హిడ్మా స్థానిక ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి కావడంతో అతడికి గ్రామస్థుల మద్దతు లభించేది. దీంతో బలమైన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొన్నాడు. అతడు ఉన్న ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల అవతల భద్రతా దళాల కదలికలు కూడా అతనికి తెలిసిపోతాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు తేలిగ్గా వెళ్లే జంక్షన్‌లో ఉండటం కూడా అతనికి కలిసి వస్తోందని గతంలో ఓ భద్రతా అధికారి వెల్లడిరచారు. కేవలం 7వ తరగతి వరకే చదివిన హిడ్మా ఇంగ్లిష్ మాత్రం చక్కగా మాట్లాడగలడని 2015 ఫిబ్రవరిలో అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఓ విలేకరి పేర్కొన్నారు.
కర్రెగుట్టల దాడితో ఆంధ్రాకు వచ్చి..
హిడ్మా కోసం కొన్నేళ్లుగా ఛత్తీస్‌గఢ్ పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్‌మడ్ పర్వతాలతోపాటు నేషనల్ పార్కులో భద్రతా దళాలు అణువణువూ జల్లెడ పట్టాయి. దండకారణ్యంలో వేలాదిగా సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహించగా.. అనేకమంది మావోయిస్టు అగ్రనేతలు వరుసగా ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు హిడ్మా కూడా తన బెటాలియన్‌తో కలిసి నేషనల్ పార్క్‌లోనే ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానించాయి. ఆ సమయంలో అతడి తాజా ఫొటో ఒకటి బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.అయితే, జనవరిలో భద్రతా బలగాలు తన స్థావరాన్ని చుట్టుముట్టడానికి కొన్ని గంటల ముందే హిడ్మా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సమీపంలోని ఓ కొండల ప్రాంతంలో నక్కినట్లు తెలిసింది. ఓ సమయంలో హిడ్మా లొంగిపోనున్నాడనే ప్రచారం కూడా జరిగింది. భద్రతా బలగాల కూంబింగ్ నిరంతరం కొనసాగుతుండటంతో హిడ్మా బృందం.. ఛత్తీస్‌గఢ్ నుంచి మకాం మార్చేందుకు ఆంధ్రా సరిహద్దులను పరిశీలించినట్లు పోలీసు వర్గాలు వెల్లడిరచాయి. మారేడుమిల్లి సరిహద్దు మీదుగా వీరు ఆంధ్రాలోకి ప్రవేశించారని, అక్కడి నుంచి ఒడిశా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నాయి. వీరి కదలికలపై సమాచారం అందడటంతో భద్రతా బలగాలు తాజా ఆపరేషన్‌ను చేపట్టాయి.
ఆంధ్రాలో మావోయిస్టుల అలజడి
` ఏపీలో 31 మంది సభ్యుల అరెస్ట్
` ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా
రంపచోడవరం(జనంసాక్షి): అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. మంగళవారం ఉదయం 6.30-7.00 గంటల మధ్య భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. ఎన్‌కౌంటర్ వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌తో కలిసి ఆయన వెల్లడిరచారు. గత రెండు రోజులుగా ఇంటెలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలను విస్తృతంగా చేపట్టామని మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. మావోయిస్టుల నుంచి వివిధ రకాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడిరచారు.మరోవైపు కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు.
ఏలూరులో 15 మంది మావోయిస్టులు అరెస్ట్?
ఏలూరులో 15 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. వాటి ఆధారంగా పలు జిల్లాలో గాలింపు చేపట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ ఆధ్వర్యంలో ఏలూరు శివారులోని గ్రీన్‌సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఓ భవనంలో 15మంది మావోయిస్టులను స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒడిశాకు చెందిన వీరంతా గత వారం రోజులుగా గ్రీన్‌సిటీలో తలదాచుకున్నట్టు అనుమానిస్తున్నారు.ఏలూరులో ఎంత కాలంగా ఉంటున్నారు? ఈ ప్రాంతాన్నే షెల్టర్ జోన్‌గా ఎందుకు ఎంచుకున్నారు? ఏలూరు జిల్లా పరిధిలో ఇంకా ఎంతమంది మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. భవన యజమాని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. విజయవాడలో 32 మంది, కాకినాడలో ఇద్దరు మావోయిస్టులను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హిడ్మా డైరీ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ, ఏలూరు, కాకినాడ నగరాలలో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో పోలీస్, గ్రేహౌండ్స్ బృందాలు జల్లెడ పడుతున్నాయి.
విజయవాడలో 27 మంది మావోయిస్టులను అరెస్ట్
విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్‌లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అరెస్టయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు చోట్ల డంప్‌లు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టారు.స్థానిక పోలీసుల సాయంతో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు కొత్త ఆటోనగర్‌ను ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేస్తున్నాయి. భవన యజమాని కోసం పోలీసులు ఆరా తీశారు. అతడు నెలన్నర నుంచి విదేశాల్లో ఉంటున్నట్లు తెలిసింది. పది రోజుల క్రితం ఈ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనుల కోసం వచ్చామంటూ, అద్దెకు ఉంటామని మావోయిస్టులు ఈ భవనంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.విజయవాడ ఆటోనగర్‌లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కచ్చితమైన సమాచారంతో సోదాలు చేశామన్నారు. విజయవాడతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సోదాలు నిర్వహించామని, మావోయిస్టులకు సంబంధించి 5 జిల్లాల్లో ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు. ‘‘ఆటోనగర్‌లోని కానూరులో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం వచ్చింది. వారందర్నీ అదుపులోకి తీసుకున్నాం. పట్టుబడిన వారిలో ఎక్కువమంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారున్నారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి బృందాన్ని పట్టుకున్నాం. పట్టుబడిన మావోయిస్టులకు సంబంధించిన సమాచారం రేపు చెబుతాం’’అని అన్నారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో జరిగిన సోదాల్లో ఇప్పటి వరకు మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.



