కర్నాటక పోలీసులకు బరువైన పరీక్ష

బెంగళూరు,జూలై10(జ‌నం సాక్షి ): బరువు ఎక్కువున్న పోలీసులకు కొత్త చిక్కు వచ్చిపడింది. బరువు తగ్గించుకుంటే సరి… లేదంటే సస్పెన్షన్‌ వేటు తప్పదంటూ కర్ణాటక అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ భాస్కరరావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనిపై మంగళవారంనాడు ఆయన విూడియాతో మాట్లాడుతూ, బరువు ఎక్కువున్న పోలీసులను గుర్తించే పక్రియ మొదలైందన్నారు. నిర్దేశిత బరువు కంటే ఎక్కువ వెయిట్‌ ఉంటే తప్పనిసరిగా బరువు తగ్గించుకోవాలని, లేని పక్షంలో సర్వీస్‌ నుంచి సస్పెండ్‌ చేయడం, సర్వీసులో కఠినమైన విధులు, అదనపు డ్యూటీలు వేస్తామని చెప్పారు. ఆరోగ్యవంతమైన, ఫిట్‌నెస్‌ కలిగిన వ్యక్తులను దేశం కోరుకుంటోందని, ఇందుకు అనుగుణంగా త్వరలోనే పోలీస్‌ కాంట్లీన్లలో ఆరోగ్యకరమైన భోజన సదుపాయం ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే పోలీస్‌ క్యాంపస్‌లలో శారీరక దారుఢ్య కార్యక్రమాలను పెంచుతామన్నారు. బరువు ఎక్కువ ఉన్న పోలీసులకు బరువు తగ్గించుకునేందుకు వీలుగా కౌన్సిలింగ్‌ ఇప్పిస్తామని, అప్పటికీ బరువు తగ్గించుకోకుంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ‘గడువులోగా పోలీసులు తమ బానపొట్టలు తగ్గించుకోవాల్సిందే. లేదంటే క్రమశిక్షణా చర్యలకు వెనుకాడం’ అని ఏడీజీ స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చిలో కోయంబత్తూరులో అధిక బరువున్న పలువురు రూరల్‌ పోలీసులను గుర్తించి ఫిట్‌నెస్‌ కోసం మూడు వారాల కఠిన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.