కర్నూలులోనూ హైడ్రా తరహా చర్యలు
భూ కబ్జాదారుల భరతం పట్టాల్సిందే
దేవాలయ భూములను కూడా వదలని రియల్టర్లు
చంద్రబాబు రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలి
ప్రజలు రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదు చేయాలి
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వెల్లడి
కర్నూలు,ఆగస్టు 27 (జనం సాక్షి): హైదరాబాద్ తరహాలో కర్నూలులో కూడా హైడ్రా అవసరమని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆక్రమణలు తొలగించాలంటే కఠినంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అమెరికాలో ఉన్న వారు కూడా కర్నూలు శివారులోని విలువైన భూములను కబ్జా చేశారన్నారు. కర్నూలు డెవలప్మెంట్ అథారిటీలో భారీ అక్రమాలు జరిగాయని తెలిపారు. కబ్జాకు గురైన భూముల్లో ఇళ్లు కట్టుకున్న బాధితులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రెవిన్యూ, రిజిస్టేష్రన్ ఫారెస్టు, ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కై రియల్ ఎస్టేట్ మోసగాల్లు రికార్డులు తారుమారు చేసి వేల కోట్లు సంపాదించారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ… చివరికు దేవుని మాన్యం భూములు, వక్స్ బోర్డు భూములను కూడా కబ్జా చేశారన్నారు. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి శిష్యుడు బత్తుల మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూ కబ్జాలపై విచారణ మొదలైందన్నారు. కర్నూలు జగన్నాథ గట్టుపై 79 ఎకరాలు కొట్టేసిన పొలాలను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సందర్శించారని తెలిపారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి జరిగే రెవిన్యూ సదస్సుల్లో బాధితులు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. తవ్వేకొద్ది వైసీపీ భూ కబ్జా నిర్వాకాలు బయటికొస్తున్నాయన్నారు. దీపారాధన జరగాలని మన పూర్వీకులు దేవాలయాలకు భూములు ఇచ్చారని.. వాటిని కూడా రియల్ మోసగాళ్లు రికార్డులు తారుమారు చేసి కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లూరులోని ఈశ్వర ఆంజనేయ స్వామి ఆలయం భూములు కబ్జా చేసి వెంచర్ల కోసం రోడ్లు వేశారన్నారు. పసుపుల శివారులోని గంగమ్మ గుడి భూములను సైతం కొట్టేశారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు ఎందుకు రెండు చాలని వైఎస్
రాజశేఖరరెడ్డి జీవోలు ఇచ్చారని…. దాన్ని తాను తీవ్రంగా ఖండిరచానన్నారు. దేవుని జోలికి వెళ్లి వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం పాలయ్యారని తెలిపారు. వైఎస్సార్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏ దేవుడు క్షమించడం లేదన్నారు. భూ బకాసురులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జోహరాపురంలో వీరభద్ర స్వామి ఆలయానికి భక్తులు ఇచ్చిన 20 ఎకరాలను కబ్జా చేశారని… ఇందులో ప్రైవేటు డాక్టర్లు కూడా ఉన్నారన్నారు. కబ్జాకు గురైన భూములు తిరిగి దేవాలయాలకు చెందే వరకూ పోరాటం చేస్తానన్నారు. జోహరాపురంలో విలువైన భూములను కమ్యునిస్టు పార్టీలు జెండాలు పాతారని తెలిపారు. హంద్రీనది బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టారన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా పని తీరు బాగుందని.. రాయలసీమ నాయకులు కూడా హైదరాబాద్‌లో చెరువులు కబ్జా చేశారని తెలిపారు. కర్నూలులోని హంద్రీనదిలో అక్రమ నిర్మాణాలు పడగొట్టాలన్నారు. కర్నూలులో కబ్జాల కాలేజ్ నడుస్తోంది.. కాలేజ్ ఛైర్మన్ వైయస్ జగన్. ప్రిన్సిపాల్ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిలాంటి వారని అంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు.