కర్షకుల కష్టాలపై కాంగ్రెస్ పోరుబాట
హైదరాబాద్,నవంబరు 25(జనంసాక్షి):రైతులు కష్టపడి పండిరచిన ధాన్యాన్ని కొనకుండా రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో ప్రధాని మోదీ నాటకాలాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వారిద్దరూ కలిసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. గాంధీ భవన్‌లో కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు, తెరాస ఎన్నారై సెల్ అమెరికా విభాగం అధ్యక్షుడు అభిలాష్‌రావ్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిన రేవంత్ రెడ్డి.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.‘‘కొల్లాపూర్ ప్రజలకు తాగడానికి నీళ్ల ఇవ్వరు.. రైతులకు సాగు నీరు ఇవ్వరు. భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారు. ఈ తెలంగాణ ఎవరి కోసం వచ్చింది.. ఎవరు పాలిస్తున్నారో ప్రజలు ఆలోచించాలి. పాలమూరు జిల్లా ప్రజలను కేసీఆర్ అన్ని విధాలుగా మోసం చేశారు. పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. హైదరాబాద్‌లో ఏ ఆడ్డవిూద చూసినా పాలమూరు బిడ్డలే కూలీలుగా ఉన్నారు. పాలమూరు బిడ్డలు ఐఏఎస్ , ఐపీఎస్‌లు కావద్దా? వారంతా బానిసలుగానే బతకాలా?టీపీసీసీ నాకు ఇవ్వడం అంటే సోనియాగాందీ పాలమూరు జిల్లాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తాను. నేను పాలమూరు బిడ్డనని గర్వంగా చెప్పుకుంటాను. ప్రధాని మోదీ, కేసీఆర్ కలిసి రైతులను మోసం చేస్తున్నారు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదలు ఇప్పటివరకు 67వేల మంది అన్నదాతలు చనిపోయారు. ఉత్తరాది రైతులకు రూ.3 లక్షలు ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. స్వరాష్ట్రంలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఎందుకు ఇవ్వరు?ఇదేనా తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమం? ఇదేం న్యాయం? తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకుగాను ఈ నెల 27, 28వ తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రెండు రోజులు వరి దీక్ష చేపడుతున్నాం. ఈ దీక్షకి పెద్ద ఎత్తున రైతులు, కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి’’ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.