కలాం ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి

5

– రామేశ్వరం విగ్రహావిష్కరణ సభలో వెంకయ్య

రామేశ్వరం,జులై 27(జనంసాక్షి): అబ్దుల్‌ కలాం ఆలోచనలు, కలలను సాకారం చేయడమే ఆయనకు సమర్పించే నిజమైన నివాళి అనికేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుఅన్నారు. దేశ ప్రజల హృదయాల్లో అబ్దుల్‌ కలాం ఎప్పుడూ చిరంజీవిగా ఉంటారని కొనియాడారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం తొలి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయనకు పలుప్రాంతాల్లో ఘనంగా నివాళి అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.  తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన స్వస్థలమైన పేయ్‌కరుంబు ప్రాంతంలో వర్థంతి  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏడు అడుగుల అబ్దుల్‌ కలాం కాంస్య విగ్రహాన్ని కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్‌ పారికర్‌, పొన్‌ రాధాకృష్ణన్‌ ఆవిష్కరించారు. అబ్దుల్‌ కలాం భౌతికకాయాన్ని ఖననం చేసిన ప్రాంతంలో ఏర్పాటు కానున్న స్మారక మందిరం, జాతీయ స్మారక చిహ్నం, మ్యూజియాలకు కేంద్రమంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ  సందర్భంగా వెంకయ్య  మాట్లాడుతూ కలాం నిరాడంబర జీవి అన్నారు. ఆయన ప్రాతఃస్మరణీయులని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి అభివృద్ది సాధిస్తే అదే గొప్ప నివాళి అన్నారు. రామనాథపురం, పరిసర జిల్లాల్లోని కళాశాల, పాఠశాలల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కలాం ఉపయోగించిన చిత్రాలు, వస్తువులు, ధరించిన వస్త్రాలు, పుస్తకాలు తదితరాలతో అక్కడ తాత్కాలికంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థులు దీన్ని తిలకించే అవకాశం కల్పించారు. పుదుచ్చేరికి చెందిన గుబేంద్రన్‌ అనే యువకుడు ఈ సందర్భంగా అక్కడ అబ్దుల్‌ కలాం సైకత శిల్పం రూపొందించారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా అబ్దుల్‌ కలాం ఇంటర్నేషనల్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో లక్ష మొక్కలను పంపిణీ చేయనున్నట్లు కలాం మనవడు షేక్‌ సలీం తెలిపారు. దీంతో పాటు కొన్ని పుస్తకాలను కూడా పంచి పెడతామని పేర్కొన్నారు.